
మరో రెండింటిలోనూ స్లాట్ బుకింగ్ సేవలు
మెట్టుగడ్డ: రాష్ట్రవ్యాప్తంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను గత ఏప్రిల్ 10న పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించగా.. అందులో ఉమ్మడి జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్న విషయం విదితమే. అయితే రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం స్లాట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అందులో నారాయణపేట, కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. కల్వకుర్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రారంభమైన స్లాట్ బుకింగ్ సేవలను జిల్లా స్టాంఫ్స్, రిజిస్ట్రేషన్ల అఽధికారి వి.రవీందర్ పరిశీలించారు. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వేగవంతంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అదే విధంగా స్లాట్ బుకింగ్ సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. స్లాట్ బుకింగ్ ద్వారా వచ్చే అమ్మకపు, కొనుగోలు దారులకు కార్యాలయాల్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. స్లాట్ బుకింగ్ లేకుండా రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలకు ఐదు వాక్‌ఇన్ రిజిస్ట్రేషన్లుగా సాయంత్రం 5నుంచి 6గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నందున, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.