
కంఠస్థ పోటీల కరపత్రాలను విడుదల చేస్తున్న సంస్కృత భారతి సభ్యులు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: గీతా జయంతిని పురస్కరించుకుని ఈనెల 23న స్థానిక వెంకటేశ్వరకాలనీలోని శ్రీరామకృష్ణ సేవా సమితి కార్యాలయంలో శ్రీమద్భవద్గీత శ్లోక కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్టు సంస్కృత భారతి పాలమూరు జిల్లా అధ్యక్షుడు జ్యోషి ఆనందాచార్యులు, కార్యదర్శి మలిశెట్టి నాగరాజు తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సమితి కార్యాలయంలో ఈ పోటీలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ రోజు ఉదయం పది గంటలకు నాలుగు స్థాయిలలో ఈ పోటీలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా శిశుస్థాయికి ఎల్‌కేజీ నుంచి రెండో తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులన్నారు. వీరు ఒకటి నుంచి ఐదో శ్లోకం కంఠస్థం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాథమిక స్థాయికి సంబంధించి మూడు నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులన్నారు. వారు ఒకటి నుంచి పదో శ్లోకం కంఠస్థం చేయాల్సి ఉంటుందన్నారు. మాధ్యమిక స్థాయికి గాను ఆరు, ఏడు తరగతుల వారు ఒకటి నుంచి 15వ శ్లోకం వరకు కంఠస్థం చేయాల్సి ఉంటుందన్నారు. ఇక ఉన్నతస్థాయికి సంబంధించి ఎనిమిది నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు అర్హులన్నారు. వీరు ఒకటి నుంచి 20వ శ్లోకం వరకు కంఠస్థం చేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం గెలుపొందిన వారికి మొదటి, రెండు, మూడో బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే పాల్గొ న్న వారందరికీ ప్రశంసాపత్రం ఇస్తామన్నారు.