
వలస పక్షులను తరిమికొట్టండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని మహేశ్వరంలో రజాకార్ల రాజ్యం నడుస్తుందని అనుకుంటున్నారా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. ఎంఐఎం అరాచకాలు శ్రుతి మించినా అధికార పార్టీ నోరు మెదపలేదని, మహేశ్వరంలో కట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కూడా పాతబస్తీ ఎంఐఎం కార్యకర్తలకు పంచిపెట్టారని ధ్వజమెత్తారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా అందెల శ్రీరాములు యాదవ్ దాఖలు చేసిన నామినేషన్ కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్థానిక పరిస్థితులపై ధ్వజమెత్తారు. మహేశ్వరంలోని కందుకూర్ మండలంలో ఫార్మా సిటీ కోసం 19వేల ఎకరాలు రైతుల నుంచి లాక్కున్నారని, స్థానికులకు మాత్రం ప్రభుత్వం ఒక్క ఉద్యోగమివ్వలేదని విమర్శించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలకు, అవినీతి, అక్రమాలకు అంతేలేదని, ధరణి పేరుతో ఆమె తనయుడు భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక పార్టీ టికెట్‌పై గెలిచి ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి పదవులను అనుభవించడం సిగ్గు చేటన్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓ డమ్మీ అని, మేడ్చల్ నుంచి వలస వచ్చి పోటీ చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలిద్దరూ కాంగ్రెస్ నుంచి వచ్చిన వలసపక్షులేనని అన్నారు. వారిని ఎన్నికల్లో ఓడించి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు యాదవ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని మహేశ్వరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.