రాష్ట్రంలో ఆయిల్ కొరత నివారణకు ప్రభుత్వం ఆయిల్‌పాం తోటల సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఆయిల్‌పాం ద్వారా పామాయిల్ తయారీకి అనువుగా కొత్తగా ఆయిల్ క్రషింగ్ యూనిట్స్ నిర్మిస్తుంది. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేటలో రెండు యూనిట్స్ ఉన్నాయి. వాటికి తోడుగా కొత్తగా సిద్ధిపేట, మహబూబాబాద్‌తోపాటు జిల్లాలోని ఇటిక్యాల మండలం బీచుపల్లిలో ఉన్న విజయవర్ధిని ఆయిల్‌మిల్‌ను పునరుద్ధరిస్తోంది.
10 వేల ఎకరాల్లో సాగు..
జిల్లాతోపాటు నారాయణపేటలో ఆయిల్‌పాం సాగు అంతకంతకూ పెరిగింది. రెండు జిల్లాలకు అనువుగా బీచుపల్లిలో క్రషింగ్ ప్రారంభం కానుంది. ఈ యూనిట్‌లో గంటకు 30 టన్నులు (ఒక రోజుకు 600 టన్నులు) పామాయిల్ గెలలను వేరు చేసి క్రషింగ్ చేయనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 10 వేల ఎకరాల్లో పంట సాగవుతోంది. మరో ఏడాదిన్నరలో 25 వేల ఎకరాలకు పెంచడానికి వీలుగా సాగు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఆయిల్ మిల్లు రాకతో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి. నిర్మాణం పూర్తయ్యాక ప్రత్యక్షంగా 400 మంది, పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ పరిధిలో..
రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఆయిల్‌పాం సాగు జరిగే విధంగా చర్యలు చేపడుతుంది. వీటిలో 7 జిల్లాలు ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ పరిధిలో సాగును ప్రోత్సహించి క్రషింగ్ మిల్లులను నిర్మిస్తోంది. జోగుళాంబ గద్వాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, మహబూబాబాద్, ములుగు, జనగాం, నారాయణపేట జిల్లాలు ఉన్నాయి. ఆయిల్‌పాం క్రషింగ్ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ సంస్థ పరిధిలో కొనసాగనుండగా.. మిగిలినది ప్రైవేటు కంపెనీల ద్వారా నిర్వహించనున్నారు. భవిష్యత్‌లో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.