
నాగర్‌కర్నూల్ రూరల్: మండలంలోని కుమ్మెరలో పాలమూరు ఇరిగేషన్ పథకానికి భూమిచ్చి పరిహారం అందక ఆత్మహత్యకు పాల్పడిన రైతు అల్లోజి కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పస్యపద్మ డిమాండ్ చేశారు. గురువారం గ్రామానికి వెళ్లి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అల్లోజిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా చేనుతో సైతం రైతుల దగ్గర భూమిని గుంజుకొని రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న అల్లోజి కుటుంబాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ పరామర్శించకపోవడం దుర్మార్గం అన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రత్యక్ష కార్యచరణ రూపొందించి పోరాడతామని హామీ ఇచ్చారు. రైతు కోల్పోయిన భూమికి ఎకరాకు రూ.2లక్షల4వేలు తీసుకోవాలని బలవంత పెట్టారన్నారు. తాత ముత్తాతల నుంచి సంపాదించిన ఆస్తిపై హక్కు కలిగి ఉన్నప్పటికి భూమి వదులుకోవాలని భూమిలోకి వెళితే అక్కడే ఉన్న ప్రేమ్‌కుమార్‌తోపాటు మరికొందరు అవమానపరిచారని అన్నారు. ఇరిగేషన్ అధికారులు, పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నాగర్‌కర్నూల్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి భూమిలోకి వెళ్లొద్దని అల్లోజిపై కేసు పెట్టారని, హెచ్చరించడం ఇవ్వడం వల్లే మనస్తాపానికి గురై అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె అన్నారు. ఇప్పటికై న ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వార్ల వెంకటయ్య, కృష్ణా, బాలయ్య, ఖాజా, చెన్నయ్య, గౌరమ్మ, అల్లోజి కుటుంబ సభ్యులు లక్ష్మీదేవమ్మ, మైబూసు, అంజనమ్మ పాల్గొన్నారు.