నవాబుపేట మండలంలో ఉపాధి హామీ పథకంలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ప్రశాంత్‌రెడ్డిని సిట్ బృందం ఈ నెల 24న అదుపులోకి తీసుకుంది. ఇతను టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీలో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డికి స్వయానా బంధువు. ప్రశాంత్‌రెడ్డి విచారణలో వెల్లడించిన సమాచారం మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఫరూక్‌నగర్ మండలం నేరళ్లచెరువుకు చెందిన రాజేందర్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇతను వారి గ్రామంలో ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తితో రూ.5 లక్షలు అప్పుగా తీసుకుని.. పేపర్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రశాంత్, రాజేందర్‌ను విచారించిన క్రమంలో గండేడ్ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తిరుపతయ్య పేరు తెరమీదికి వచ్చింది. డాక్యానాయక్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన లీకేజీ అయిన ఏఈ ప్రశ్నపత్రం విక్రయంలో అభ్యర్థులు, డాక్యానాయక్‌కు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా సిట్ అధికారులు ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు చెందిన తొమ్మిది మందిని అరెస్టు చేయడంతో పాటు మరో ఇద్దరు కూడా వారి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉమ్మడి పాలమూరులో గండేడ్, నవాబ్‌పేట, మహబూబ్‌నగర్, షాద్‌నగర్ ప్రాంతాల్లో పర్యటించి విచారణ చేశారు. స్థానిక పోలీసులకు సైతం సమాచారం ఇవ్వకుండా రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ బాగోతం మరికొందరి మెడకు చుట్టుకునే అవకాశమున్నట్లుతెలుస్తోంది.