జడ్చర్ల: మురుగు నీటి కాలువ పక్కగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి కాలువ నీటిలో పడ్డాడు. ఊపిరాడక అక్కడే మృతిచెందాడు. ఆ మృతదేహాన్ని పందులు పీక్కుతుంటుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. స్థానిక లక్ష్మీనగర్ కాలనీకి చెందిన వడ్ల బ్రహ్మచారి(54) సోమవారం రాత్రి పట్టణంలోకి వెళ్లి వస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరాడు. సమీపంలోని ప్రభుత్వ ఎస్టీ హాస్టల్ పక్కన గల మురుగు కాల్వలో ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందాడు. ఈ సంఘటనపై మంగళవారం మృతుడి భార్య ప్రేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా పట్టణంలో పందుల సంచారం తీవ్రంగా ఉందని పట్టణవాసులు తెలిపారు. నియంత్రించే చర్యలు తీసుకోవాలని అధికారులు, పాలకులను కోరుతున్నారు.
ప్రేమించిన వాడితో పెళ్లి చేయలేదని ఆత్మహత్య
ఖిల్లాఘనపురం: ప్రేమించిన అబ్బాయితో పెళ్లి చేయలేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం కమాలోద్దిన్‌పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దానిగారి పెద్దబచ్చన్న, చెన్నమ్మ చిన్నకూతురు దానిగారి శిరీష(23) మహేష్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కూతురిని పిలిచి ఈ వ్యవహారం వద్దు.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తామని ఇటీవల చెప్పారు. మంగళవారం కుటుంబ సభ్యులు వివిధ పనుల మీద రోజులాగే వెళ్లిపోయిన తర్వాత, ఇంట్లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు హుటాహుటిన ఇంటికి వచ్చారు. కానీ అప్పటికే శిరీష మృతి చెందింది. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీహరి తెలిపారు.
● కమాలోద్దిన్‌పూర్‌లో ఘటన
● కేసు నమోదు
బాదేపల్లిలో ఘటన