
ఎర్రగుట్టలో ప్రారంభానికి ఎదురుచూస్తున్న డబుల్‌బెడ్ రూం ఇళ్లు
జడ్చర్ల: ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లకు మోక్షం లభించనుంది. వచ్చే నెలలో ఇళ్లు కేటాయించే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎంతోకాలంగా డబుల్ బెడ్ రూం ఇళ్లకోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనతో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటివరకు జడ్చర్ల నియోజకవర్గంలో లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించలేదు. జడ్చర్ల, తదితర గ్రామాలలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను త్వరలోనే పంపిణీ చేస్తామని స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రకటించడంతో ఇళ్లు లేని నిరుపేదల్లో ఆశలు రేగాయి. జడ్చర్ల నియోజకవర్గంలో దశలవారీగా మొత్తంగా ఇప్పటివరకు 2,604 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరయ్యాయి. ఎక్కువగా జడ్చర్ల మండలంలోనే దాదాపు 2వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇక ఆయా మండలాల్లో అతి తక్కువ సంఖ్యలో మంజూరయ్యాయి. బాలానగర్, రాజాపూర్ మండలాల్లో కేవలం 104 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి.
నాసిరకంగా పనులు..
డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర ఎంతమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక, స్టీలు, సిమెంట్ తదితర మెటీరియల్ ధరలు పెరగడంతో ఇళ్ల నిర్మాణం భారంగా మారింది. దీంతో నిర్మాణాల్లో నాణ్యత కొరవడింది.
దరఖాస్తుల వెల్లువ..
ఇప్పటికే దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క జడ్చర్ల పట్టణంలోనే దాదాపు 3వేలకు పైగా డబుల్‌బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని ఊహించవచ్చు. అయితే అర్హులను గుర్తించి ఇళ్లు కేటాయించడంలో అధికారులు ఎంతమేరకు పారదర్శకత పాటిస్తారో వేచి చూడాల్సిఉంది.
శిథిలావస్థకు చేరుతున్నాయి..
ప్రభుత్వం నిర్మించిన డబుల్‌బెడ్ రూం ఇళ్లు సకాలంలో లబ్ధిదారులకు పంపిణీ చేయని కారణంగా ఇళ్లు దెబ్బతింటున్నాయి. వర్షాలకు ఎక్కడికక్కడ నీళ్లు చేరి పగుళ్లు ఏర్పడుతున్నాయి. తలుపులు, కిటికీలు ఊడిపోతున్నాయి. దీంతో లబ్ధిదారుల చేతికి వచ్చే నాటికి మళ్లీ మరమ్మతు చేయించుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి.
నిర్మాణాలు పూర్తి..
బాదేపల్లి ఎర్రగుట్ట ప్రాంతంలో దాదాపు 360 డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయి దాదాపు నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. అదేవిధంగా కావేరమ్మపేటలో కూడా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ తాగునీరు, విద్యుత్, సీసీరోడ్లు నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చర్లపల్లి, కిష్టంపల్లిలో పనులు పూర్తయ్యాయి. బాలానగర్ మండలంలోని గౌతాపూర్, నవాబ్‌పేట మండలంలోని రుద్రారం, మిడ్జిల్ మండలంలోని కొత్తపల్లి, మసిగుండ్లపల్లి, వాడ్యాల గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్ల పనులు పూర్తి చేసుకుని ప్రారంభానికి ఎదురుచూస్తున్నాయి.
ప్రారంభానికి సిద్ధం..
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేశాము. విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ శాఖకు డబ్బులు చెల్లించాము. డ్రెయినేజీ పనులు చివరిదశలో ఉన్నాయి. తాగునీరు, ఇతర పనులు త్వరగా పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించేందుకు ఏర్పాట్లు చేశాము.
– నర్సిములు, ఏఈ, హౌసింగ్, జడ్చర్ల
అర్హులను ఎంపిక
చేయాల్సి ఉంది..
ఇళ్ల కేటాయింపునకు అర్హులయిన వారిని ఎంపిక చేయాల్సిఉంది. ఇప్పటివరకు ఒక్క జడ్చర్ల పట్టణానికి సంబందించి దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని విచారించి అర్హులైన వారిని త్వరలోనే గుర్తించేలా చర్యలు తీసుకుంటాము.
– లక్ష్మీనారాయణ, తహసీల్దార్, జడ్చర్ల
వచ్చే నెలలో పంపిణీ..
వచ్చే నెలలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేస్తాము. అర్హులను ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఖాళీస్థలాలు ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3లక్షలు అందజేసేందుకు చర్యలు చేపట్టాము.
– డాక్టర్ సి.లక్ష్మారెడ్డి,
ఎమ్మెల్యే, జడ్చర్ల
ఏప్రిల్‌లో పంపిణీకి సన్నాహాలు
జడ్చర్ల నియోజకవర్గంలో
2,604 ఇళ్లు మంజూరు
ఇప్పటివరకు పూర్తయినవి వెయ్యి ఇళ్లు

