జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ సర్కిల్ నుంచి నారాయణపేట జిల్లా విభజనలో విద్యుత్ ఉద్యోగులైన ఆర్టిజన్లను పరిగణలోకి తీసుకు వారిని విభజించడం దుర్మార్గమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు 1104 రీజినల్ అధ్యక్షుడు స్వామి అన్నారు. ఖాళీలను నింపకుండా నారాయణపేట జిల్లాకు ఉద్యోగులను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం 1104 యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్‌భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణపేట జిల్లాకు సరిపడే పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నారాయణపేటతో పాటు ఏర్పడిన ములుగు జిల్లా విభజనలో ఆర్టిజన్లను పరిగణలోకి తీసుకోలేదని, కానీ పేట జిల్లాకు ఆర్టిజన్లను ఎందుకు విభజించారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మాత్రమే ఎందుకు కిందిస్థాయి ఉద్యోగులను విభజించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ విభజనలో ఎక్కువగా వితంతులు, తల్లిదండ్రులను కోల్పోయిన కిందస్థాయి ఉద్యోగులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో వర్కింగ్ ప్రెసిడెంట్ యాదయ్యగౌడ్, డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పెంటయ్య, సర్కి యూనిట్ ప్రెసిడెంట్ రామరాజు ఉన్నారు.