
వాల్‌పోస్టర్లు విడుదల చేస్తున్న కలెక్టర్ రవినాయక్ తదితరులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హరితహారం మొక్కల పెంపకంపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. వైకుంఠధామాల్లో విద్యుత్, నీటి సౌకర్యంపై దృష్టి పెట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధించి రానున్న రెండు రోజులు కీలకమని ఖాతాలు తెరిచేందుకు అప్‌లోడ్ చేయడం పూర్తి చేయాలన్నారు. అగ్ని ప్రమాదాలు, వడగాలులు, ఎండలకు బయట తిరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. వేసవి దృష్ట్యా గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. వచ్చేనెల 3 నుంచి పదో తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం ఈ నెల 20 నుంచి వచ్చే నెల 6 వరకు నిర్వహిస్తున్న పోషణ పక్షం వాల్‌పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి జరీనాబేగం, డీఆర్‌డీఓ యాదయ్య, డీపీఓ వెంకటేశ్వర్లు, జెడ్పీసీఈఓ జ్యోతి, మిషన్ భగీరథ ఈఈ పుల్లారెడ్డి, డీఈఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను పరిష్కరించాలి
ప్రజల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా పరిష్కరించే వాటిని అక్కడే పరిష్కరించాలని సూచించారు. పింఛన్లు, ధరణి సమస్యల పరిష్కారంలో భాగంగా పాత కేసులపై తహసీల్దార్లు దృష్టిసారించాలన్నారు. సుమారు 430 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, డీఆర్‌డీఓ యాదయ్య, జెడ్పీసీఈఓ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.