
వీసీలో పాల్గొన్న కలెక్టర్ రవినాయక్, అధికారులు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పట్టణ ప్రాంత గృహ నిర్మాణ లబ్ధిదారుల వివరాలు అప్‌లోడ్ చేసే కార్యక్రమాన్ని ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తి చేస్తామని కలెక్టర్ రవినాయక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 3,471 ఇళ్లు పూర్తి చేసి 2,093 మంది లబ్ధిదారులకు ఎంపిక చేశామన్నారు. వీటికి సంబంధించి 1,964 లబ్ధిదారుల వివరాలను అప్‌లోడ్ చేయగా 129 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మిగిలి 1,507 ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసి వారి వివరాలను సైతం ఏప్రిల్ మొదటి వారంలోగా అప్‌లోడ్ చేస్తామన్నారు. అంతకు ముందు సీఎస్ మాట్లాడుతూ కంటి వెలుగు వైద్య శిబిరాలను కలెక్టర్లు వారి స్థాయిలో తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. ఇంటర్, పదో తరగతి పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పెండింగ్‌లో ఉన్న వైకుంఠధామాలు నెల రోజుల్లో పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా 2023– 24 సంవత్సరంలో నాటనున్న మొక్కలకు సంబంధించి ప్రతి శుక్రవారం మొక్కలకు నీళ్లు పోయాలన్నారు. జీఓ 58, 59, 76, 118తోపాటు సాంఘిక సంక్షేమంలో భాగంగా ఇచ్చే హౌస్‌సైట్ పట్టాలు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.