బల్మూర్: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని బల్మూర్ మండలం కొండనాగుల బీట్ అటవీ ప్రాంతంలో ఈనెల 21న జింకను వేటాడి చంపిన సంఘటనలో ఐదుగురిని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌ఆర్వో రాజేందర్ తెలిపారు. బల్మూర్ మండలం లక్ష్మిపల్లి పంచాయతీలోని చెంచుగూడెంకి చెందిన బల్మూరి లింగస్వామి, నిమ్మల లక్ష్మయ్య, నిమ్మల రాజు, నిమ్మల మశన్న, నిమ్మల పెద్ద మశన్న కలిసి మంగళవారం రాత్రి కొండనాగుల ఫారెస్ట్ బీట్ పరిధిలో రామగిరి అడవిలో ఉచ్చులు వేసి జింకను చంపారు. తమకు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించి.. వన్యప్రాణి చట్టం1972 ప్రకారం కేసు నమోదు చేసి శుక్రవారం అచ్చంపేట కోర్టులో హాజరు పరిచినట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడి చంపడం నేరమని, ఇలాంటి సంఘటనలకు ఎవరైనా పాల్పడితే.. అటవీశాఖ అధికారులకు, సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.