
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటి నల్లా బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగియడానికి వారంరోజులు మాత్రమే మిగిలి ఉంది. మహబూబ్‌నగర్ పట్టణంలో ఇప్పటివరకు సిబ్బంది 42.77 శాతమే వసూలు చేయగలిగారు. మున్సిపాలిటీ పరిధిలో 34,894 కొళాయి–నల్లా కనెక్షన్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వీటిలో కమర్షియల్ కింద కనెక్షన్ తీసుకున్న వారి నుంచి ప్రతినెలా రూ.300 చొప్పున, బీపీఎల్ కనెక్షన్‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తారు. ఈ లెక్కన ఈ ఏడాది రూ.4,24,70,000, పాత బకాయిల కింద రూ.8,63,83,000 ఇలా మొత్తం రూ.12,88,53,000 రావాల్సి ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు రూ.3,65,14,000 వసూలు చేశారు. పాత బకాయిల కింద రూ.1,85,93,000 ఇలా మొత్తం రూ.5,51,07,000 వచ్చింది. ఇంకా ఈ ఏడాదికి గాను రూ.59,56,000, పాత బకాయిల కింద రూ.6,77,90,000 ఇలా మొత్తం రూ.7,37,46,000 పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఎనిమిది నెలల క్రితం ఔట్ సోర్సింగ్ సిబ్బంది హాజీ నల్లా బిల్లుల కింద రెండేళ్లకు సంబంధించి సుమారు రూ.25 లక్షలు వసూలు చేసి మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయలేదు. దీంతో అతడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
● భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఈసారి నల్లా బిల్లులు 8.08 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. ఈ పట్టణంలోని 2,343 కనెక్షన్లకు ఈ ఏడాది రూ.14,01,000, పాత బకాయిల కింద రూ.2,000 ఇలా మొత్తం రూ.14,03,000 రావాల్సి ఉంది. ఇందులో ఈ ఏడాదికి సంబంధించి ఇప్పటివరకు రూ.1,13,300 మాత్రమే రాబట్టగలిగారు. ఇంకా ఈ ఏడాదికి సంబంధించి రూ.12,88,000తో పాటు పాత బకాయి అలాగే పెండింగ్‌లో ఉండిపోయింది.
● జడ్చర్ల మున్సిపాలిటీలో ఈసారి నల్లా బిల్లులు 11.91శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. పట్టణంలోని 7,250 కనెక్షన్లకు గాను పాత బకాయిలు కలుపుకొని రూ.1,44,75,000 రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు రూ.17,24,000 మాత్రమే వచ్చింది. ఇంకా రూ.1,27,51,000 పెండింగ్‌లో ఉంది.
పేరుకుపోయిన నల్లా బిల్లులు
మహబూబ్‌నగర్‌లో 42.77శాతం వసూలు
జడ్చర్లలో 11.91, భూత్పూర్‌లో 8.09 శాతం మాత్రమే
వారం రోజుల్లో లక్ష్యం చేరుకోవడం కష్టమే..