
పెబ్బేరు రూరల్: ఉగాది పండుగ సందర్భంగా శ్రీరంగాపురం మండల కేంద్రంలో శ్రీరంగనాథస్వామి, అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం శేష వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగించారు. భక్తులు గోవిందనామ స్మరణతో కార్యక్రమాన్ని వీక్షించారు.
ఎస్సీ వర్గీకరణ
చేసే వరకు పోరాటం
మహబూబ్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ చేసే వరకు పోరాడుతామని ఎమ్మార్పీఎస్–ఆర్‌ఆర్ రాష్ట్ర అధ్యక్షుడు రాయికంటి రాందాస్, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సింగిరెడ్డి పరమేశ్వర్ తెలిపారు. బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చలో ఢిల్లీ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ, మహిళా బిల్లుకు చట్టబద్ధత కల్పించి, కొత్తపార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఈనెల 30న దీక్ష, 31న ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జస్టీస్ ఉషామెహ్ర కమిషన్ నివేదిక ద్వారా ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు చేసుకునే విధంగా పార్లమెంట్‌లో బిల్లు పెట్టే అవకాశం ఉన్నా మాదిగ, మాదిగ ఉప కులాలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో పూర్తి మెజారిటీ వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని నమ్మించి మోసం చేసిందని, గొప్పలు చెప్పుకునే బీజేపీని రాజకీయంగా బొంద పెట్టడానికి మాదిగలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బుర్రన్న, అశోక్, రమేష్, రాజశేఖర్, తిరుమలయ్య, రమేష్, విజయ్, చెన్నయ్య, రాజు, నగేష్, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
