
మన్యంకొండలో పంచాంగ శ్రవణం చేస్తున్న పురోహితులు
● స్వర్ణాభరణ అలంకరణలో
దర్శనమిచ్చిన వేంకటేశ్వరస్వామి
● ఘనంగా పంచాంగ శ్రవణం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. పలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి నూతన వస్త్రధారణ చేసి బంగారు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. స్వామివారిని పల్లకీలో గర్భగుడి నుంచి హనుమద్దాసుల మండపం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పూజలు చేసి తరించారు.
ఘనంగా పల్లకీసేవ
పండుగ సందర్భంగా దేవస్థానంలో స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. అలంకరించిన పల్లకిలో స్వామివారిని గర్భగుడి నుంచి గుండం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం గుండం వద్ద ఆరగింపు తదితర పూజలు చేశారు. తిరిగి మళ్లీ పల్లకీలో స్వామివారి ఊరేగింపుగా గర్భగుడి వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు.
అలంకరణలో స్వామివారు
లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఈనెల 30వ తేదీ వరకు స్వర్ణాభర అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. విశేషోత్సవాలలో మాత్రమే స్వామివారికి స్వర్ణాభరణ అలంకరణ చేస్తారు. శ్రీరామ నవమి వరకు స్వామివారికి ఈ అలంకరణ ఉంటుంది.

స్వామివారి దర్శనానికి బారులు తీరిన భక్తులు