
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఆరుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. సోమవారం మొదటి సంవత్సరం వారికి గణితం, బాటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలు జరిగాయి. ఈ క్రమంలో కోయిల్‌కొండ పరీక్ష కేంద్రాన్ని స్క్వాడ్ బృందం తనిఖీ చేయగా ఆరుగురు విద్యార్థులు చీటీలు రాస్తూ పట్టుబడ్డారు. పరీక్షకు మొత్తం 11,349 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 10,909 మంది హాజరవగా.. 440 మంది గైర్హాజరయ్యారు. మరో ఆరుగురు డీబార్ అయ్యారు.
9 మంది ఇన్విజిలేటర్ల తొలగింపు
ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా అడ్డాకుల, దేవరకద్ర, కోయిల్‌కొండ పరీక్ష కేంద్రాలు సమస్యాత్మకం కావడంతో అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో స్క్వాడ్ బృందం అడ్డాకుల పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అనంతరం కోయిల్‌కొండకు వెళ్లారు. ఇక్కడ ఆరుగురు విద్యార్థులు చీటీలు రాస్తూ పట్టుబడటంతో ఇందుకు బాధ్యులను చేస్తూ 9 మంది ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించినట్లు డీఐఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. అయితే వీరంతా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందే అని తెలుస్తుంది. వీరి స్థానంలో విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయులకు పరీక్ష విధులు కేటాయించారు.
నేడు అవగాహన సదస్సు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సకాలంలో టీడీఎస్ చెల్లింపులు, త్రైమాసిక నివేదికల సమర్పణ తదితర అంశాలపై జిల్లా అధికారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రవినాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సుకు జిల్లా అధికారులు, డ్రాయింగ్, డిస్బర్సింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఆదాయపు పన్ను శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో అన్ని రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు, ఇతర చెల్లింపులపై టీడీఎస్ 16, 16/ఏ ఫారాల సమర్పణలో ఇబ్బందులు తదితర అంశాలపై ఆదాయపు పన్ను శాఖ ఐఆర్‌ఎస్ అధికారి, జాయింట్ కమిషనర్ కృష్ణకుమార్, ఆదాయపు పన్ను అధికారి మధుసూదన్‌రావు హైదరాబాద్ నుంచి శిక్షణ ఇస్తారన్నారు.
డిమాండ్లు
నెరవేర్చకుంటే ఉద్యమం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకుంటే పెద్దఎత్తున ఉద్యమం చేసేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని విద్యుత్ ఉద్యోగుల సంఘం జేఏసీ కన్వీనర్ చంద్రమౌలి అన్నారు. సోమవారం స్థానిక విద్యుత్ భవనంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ఈపీఎఫ్, జీపీఎఫ్ అమలు చేయాలని, ఆర్టిజన్, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. తమ న్యాయమైన కోరికలను తీర్చాలని విడతల వారీగా పోరాటం చేసినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 24న విద్యుత్ సౌధ ఎదుట మహాధర్నాకు పూనుకుంటున్నట్లు చెప్పారు. ఈ ధర్నాతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. అనంతరం మహాధర్నాకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం చైర్మన్ స్వామి తదితరులు పాల్గొన్నారు.