
అన్నదాతలకు అర్థమయ్యేలా..!
హన్మకొండ : విద్యుత్ ప్రమాదాల నివారణపై టీజీ ఎన్పీడీసీఎల్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అవగాహన, చైతన్యం కల్పించేందుకు సర్కిల్ కార్యాలయాల్లోని డివిజనల్ ఇంజనీర్లకు అదనంగా సేఫ్టీ అధికారులుగా బాధ్యతలు అప్పగించింది. రైతులు, విద్యుత్ వినియోగదారుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కరించేందుకు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పొలంబాట కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. ఇప్పటి వరకు సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారాలు చూపించిన పొలం బాట.. ఈ సారి ప్రత్యేక లక్ష్యంతో ముందుకెళ్తోది. ఇందులో భాగంగా సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. అంతే కాకుండా విద్యుత్ ప్రమాదాల నివారణే ధ్యేయంగా వినియోగదారులను చైతన్య చేయడంతో పాటు, ప్రమాదాలు తలెత్తే కారణాలను విశ్లేషిస్తూ అధికారులు ముందుకెళ్తున్నారు.
హనుమకొండ జిల్లాలో..
హనుమకొండ జిల్లాలో ఇప్పటి వరకు 523 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను పరిష్కరించారు. అదే విధంగా 935 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ సరి చేశారు. తక్కువ ఎత్తులో ఉన్న 297 ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల పునర్నిర్మించారు. 3,153 మధ్య స్తంభాలు నాటారు. తుప్పు పట్టిన 467 స్తంభాలను మార్చారు. రెండేసి విద్యుత్ లైన్లు ఉన్న 286 లైన్లను సరిచేశారు. క్రాసింగ్‌లో లైన్ల మధ్య ఉండాల్సిన దూరాన్ని 170 విద్యుత్ లైన్లలో సరిదిద్దారు. 1,216 వదులు ఉన్న లైన్లను సరి చేశారు. రోడ్ క్రాసింగ్‌లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లు 185 ప్రాంతాల్లో ఎత్తు పెంచారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న 487 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను సరి చేశారు. 739 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు ఎర్తింగ్ పునరుద్ధరించారు. 224 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచారు. 359 వంగిన పోల్స్, 547 డ్యామేజీ స్తంభాలను మార్చారు. 2,965 మధ్య స్తంభాలు ఏర్పాటు చేశారు. 134 ప్రాంతాల్లో రెండేసి విద్యుత్ లైన్ల ఉన్న స్తంభాలను సరి చేశారు. విద్యుత్ లైన్ల క్రాసింగ్‌లు 348 ప్రాంతాల్లో నిర్దిష్ట ఎత్తుకు సరి చేశారు. వదులు ఉన్న 1,141 విద్యుత్ లైన్లను సరిదిద్దారు. 161 చోట్ల రోడ్డుకు అతి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్ల ఎ త్తు పెంచారు. ఓ వైపు విద్యుత్ ప్రమాదాల కారకాల ను సరిదిద్దుతూనే.. మరో వైపు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ జాగ్రత్త పాటించే విధానాలు వివరిస్తున్నారు. విద్యుత్ సమస్యలు గుర్తిస్తే 1912 ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
పొలంబాట ద్వారా విద్యుత్ ప్రమాదాల నివారణపై అవగాహన
రైతులను చైతన్య పరుస్తున్న
డీఈ టెక్నికల్, సేఫ్టీ అధికారులు