
అటవీశాఖ తరఫున అందమైన వెదురు బొమ్మలు
ములుగు: ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ సందర్శనకు ఈ నెల 14వ తేదీన రానున్న 35 మంది అందాల తారలను ఆకర్షించేలా జిల్లా అటవీశాఖ తరఫున ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈమేరకు జంగాలపల్లి గ్రామంలోని 30 మంది మేదరులకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఇద్దరు శిక్షకుల సమక్షంలో వెదురు బొమ్మల తయారీపై ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. ఇప్పటివరకు వారు చేసిన వెదరుబొంగు గ్లాసులు, డేగ, ఎడ్లబండిపై రైతు దంపతులు, చిలుకలు, విసనకర్ర, తాబేలు, పిచ్చుకలు, పింఛం వదిలిన నెమలి వంటి బొమ్మలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ బొమ్మలను అందాలతారలకు జ్ఞాపికలుగా అందించాలా.. వచ్చేవారంతా చూసేందుకు స్టాల్ ఏర్పాటు చేయాలా? అనే విషయంపై పూర్తి నిర్ణయం తీసుకోలేదు. ఆబొమ్మలకు సుందరీ మణులు ఆకర్షితులైతే వీటికి ఉచిత ప్రచారం జరగడంతోపాటు జిల్లాకు బ్రాండ్ ఇమేజ్ వస్తుందని అటవీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాకు రెండుసార్లు వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు అటవీశాఖ ఈ బొమ్మలను అందించగా ఆయన మంత్రముగ్ధుడయ్యారు. మంత్రి సీతక్క.. అధికారులను అభినందించారు. ఈ కోణంలో రామప్పకు వచ్చే సుందరీమణులను ఈ బొమ్మలు ఆకర్షిస్తాయని భావిస్తున్నారు.
20 రోజులపాటు మేదరులకు ప్రత్యేక శిక్షణ
ఇప్పటికే పూర్తికావొచ్చిన తయారీ
రామప్పలో స్టాల్ ఏర్పాటుకు ప్రణాళిక