
పుష్కర స్నానం.. మహాభాగ్యం
కాటారం: పన్నెండేళ్లకు ఒక్కసారి వచ్చే పుష్కరాలను భక్తులు మహాభాగ్యంగా భావిస్తున్నారు. కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతీనది పుష్కరాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. పిల్లలు మొదలు.. పెద్దలు, వృద్ధుల వరకు త్రివేణి సంఘమంలో పరమ పవిత్ర పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకుంటున్నారు. గతంలో ఇదే చోట జరిగిన గోదావరి, ప్రాణహిత పుష్కరాలకు సైతం వచ్చి పుష్కర స్నానం ఆచరించిన భక్తులు కొందరు ఉండగా.. మొదటి సారి పుష్కర స్నానం ఆచరించిన వారు సైతం ఉన్నారు. అత్యంత పవిత్రంగా భావించే పుష్కర స్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ పుష్కర స్నానమని పలువురు పురోహితులు, పెద్దలు పేర్కొంటున్నారు. కాళేశ్వరంలో అంతర్వాహిణిగా ఉన్న సరస్వతీ నది పుష్కరాలు ఈ నెల 15న ప్రారంభం కాగా 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
పలు రాష్ట్రాల నుంచి తరలివస్తున్న భక్తులు
సరస్వతి ఘాట్‌లో పుష్కర స్నానం
ఆలయంలో ప్రత్యేక పూజలు