
పితృ దేవతలకు పిండ ప్రదానాలు
కాటారం: కాళేశ్వరంలో కొనసాగుతున్న సరస్వతి పుష్కరాల్లో భక్తులు పుష్కర స్నానం, ప్రత్యేక పూజలతో పాటు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పన్నెండేళ్లకు ఒకసారి ఒక్కో నదికి వచ్చే పుష్కరంలో పితృదేవతలకు సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. ఒక్కో రాశి బృహస్పతి (గురువు)లో ప్రవేశించడంతో ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరం వస్తుంది. ఇలా 12 నదులకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తుంటాయి. ఈ పుష్కరాల్లో స్నానం ఆచరిస్తే సకల రోగపీడలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాకుండా, తమ కుటుంబంలో కాలం చేసిన పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు సమర్పిస్తే వారి ఆత్మకు శాంతి కలిగి మోక్షం చేకూరుతుందని భక్తులు నమ్ముతారు. ఈ ఏడాది మిథునరాశి బృహస్పతిలో ప్రవేశించడంతో కాళేశ్వరంలో అంతర్వాహినిగా కొనసాగుతున్న సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. పన్నెండు రోజుల పాటు కొనసాగనున్న పుష్కర వేడుకలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుష్కర స్నానం ఆచరించడంతో పాటు పురోహితుల సమక్షంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేసి నదిలో సంకల్పాలు చేస్తున్నారు. ప్రతీ పుష్కరంలో నది తీరాన ముప్పై మూడు కోట్ల దేవతలతో పాటు పితృదేవతలు మచ్చ రూపంలో కొలువై ఉంటారని పురోహితులు, వేద బ్రహ్మణులు చెబుతున్నారు. ప్రతీ నది పుష్కరంలో పితృదేవతలకు పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు చేయడం వల్ల వారికి మోక్షం కలుగుతుందని పేర్కొంటున్నారు.
సరస్వతి నది పుష్కరాల్లో సమర్పణ
పుష్కరాల్లో పెద్దలకు సమర్పిస్తే మోక్షం
వారి ఆత్మలు శాంతిస్తాయని
భక్తుల నమ్మకం