
దంపతుల ప్రాణాల మీదకు తెచ్చిన మద్యం
గోనెగండ్ల: భర్త మద్యం అలవాటు ఆ దంపతుల ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాలు.. గోనెగండ్లలోని కురువ పేటకు చెందిన పెద్ద ఈరన్న, ఉరుకుందమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన ఈరన్న డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. బుధవారం రాత్రి ఇదే విషయమై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. డబ్బులు ఇవ్వకపోతే పురుగు మందు తాగి చస్తానని ఈరన్న బెదిరించాడు. ఆగ్రహానికి లోనైన భార్య ఉరుకుందమ్మ తానే పురుగు మందు తాగి చస్తానని చెబుతూ పొలం కోసం తెచ్చిన పురుగు మందు తాగింది. అయోమయానికి లోనైన ఈరన్న డబ్బాలో మిగిలిన పురుగు మందు తాగేశాడు. ఇద్దరు స్పృహ కోల్పోయారు. కాలనీవాసులు వారిని గోనెగండ్ల ప్రభుత్వ ఆస్పత్రికి అక్కడినుంచి ఎమ్మిగనూరు ఆస్పత్రికి తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ విజయభాస్కర్ మాట్లాడుతూ.. భార్యభర్తలు పురుగు మందు తాగినట్లు తెలిసిందని, బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే ఆ మేరకు విచారణ చేస్తామని వెల్లడించారు.