
విష సర్పాలతో జాగ్రత్త!
● వర్షాలకు బయటకు వస్తున్న పాములు
● ఇప్పటికే పలువురికి పాముకాటు
● పొలాలు, పొదలు, తుప్పల్లో
పొంచి ఉన్న విషనాగులు
● జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
● బేతంచర్ల మండల పరిధిలోని ఆర్‌ఎస్ రంగాపురం గ్రామంలో రంగమ్మ (46) గత నెల 2వ తేదీన వేరుశనగ పంట తొలగింపు పనులకు వెళ్లి పైరును తొలగిస్తుండగా చేతికి పాముకాటు వేసింది. కుటుంబసభ్యులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం బేతంచర్ల సీహెచ్‌సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.
● ఆదోని పట్టణంలోని ఎరుకల కాలనికి చెందిన అభిరామ్ అనే బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. గత నెల 24వ తేదీన ఇంట్లో భోజనం చేస్తుండగా కాలు వద్ద ఏదో కుట్టినట్లు అనిపించి తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించగా పాము కాటేసిందని గుర్తించి వైద్యం అందిస్తుండగా కోలుకోలేక మృతి చెందాడు.
కర్నూలు(హాస్పిటల్): వర్షాలు కురుస్తున్నందున భూమి పొరల్లో నుంచి విష పురుగులు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు ఇప్పటికే పాముకాట్లకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా నెల రోజుల్లో ఇద్దరు మరణించారు. పొదలు, తుప్పలు, రాళ్ల కుప్పల్లో పొంచి ఉన్న పాములను గుర్తించకుండా వెళ్లడంతో కాటువేస్తున్నాయి. వాటి కాటుకు గురైన వారు సమీపంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చికిత్స కోసం వస్తున్నారు. అన్ని చోట్లా యాంటీ స్నేక్ వీనమ్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటున్నాయి. సకాలంలో వచ్చిన వారికి ప్రథమ చికిత్స చేసి వీటిని వేసి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు పంపిస్తున్నారు. అయితే చాలా మంది పాముకాటుకు గురైన చాలా సేపటికి ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుండటంతో ఆలస్యమై వారి ప్రాణాల మీదకు తెస్తోంది. పాము కాటు వేసిన వెంటనే ఆందోళనకు గురికావడం, ప్రథమ చికిత్సపై అవగాహన లేకపోవడం, ఆసుపత్రికి తరలించడంలో ఆలస్యం కావడం వంటి కారణాలతో విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. త్రాచు పాము, కట్ల పాము వంటి 15 శాతం పాములే ప్రమాదకరమైనవి. అన్ని పాముకాట్లు ప్రమాదకరమైనవి కావని వైద్యులు చెబుతున్నారు.

విష సర్పాలతో జాగ్రత్త!