
పదవీ విరమణ సమస్యలుంటే నేరుగా కలవండి
కర్నూలు: పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు ఉంటే నేరుగా తనను కలవచ్చని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలం పనిచేసిన తొమ్మిది మంది సిబ్బంది సోమవారం పదవీ విరమణ పొందారు. జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ భాగ్యలక్ష్మి, పత్తికొండ ఎస్‌ఐ ఎస్‌టీ జమీర్, ఆదోని పీసీఆర్ ఎస్‌ఐ బి.శ్రీరాములు, కర్నూలు డీటీసీ ఎస్‌ఐ సి.వెంకటరమణ, ఏఆర్‌ఎస్‌ఐలు బి.శ్రీనివాసులు, ఎం.బందే నవాజ్, కర్నూలు పీసీఆర్ ఏఎస్‌ఐ పీఆర్ సులోచన రాణి, ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లు వి.గోవిందరాజులు, డి.హుసేనయ్య తదితరులను పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ శాలువ, పూలమాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఇకపై కుటుంబాలతో శేష జీవితాన్ని సంతోషంగా గడపాలని, పదవీ విరమణ సమస్యలేవైనా ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. సత్కారం అనంతరం వారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ భాస్కర్ రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు కేశవరెడ్డి, తేజమూర్తి, ఆర్‌ఐలు జావెద్, నారాయణ, సోమశేఖర్ నాయక్, జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.