
అమ్మవారికి పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు ఆదివారం సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులు ఆశీనులుగావించి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
మద్దిలేటి స్వామి ఆలయ నీటి గుండంకు కంచె ఏర్పాటు
బేతంచెర్ల: మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దిలేటి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలోని నీటి గుండం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రతి శుక్ర, శనివారం అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు తరలివస్తుంటారు. ఈక్రమంలో కోనేరులో కాకుండా నీటి గుండంలోకి ఈతకు వెళ్లి ఏడాదికి ఇద్దరు లేదా ముగ్గురు మృత్యువాతపడుతున్నారు. ఈక్రమంలో ఆలయ ఉప కమిషనర్, ఈఓ రామాంజనేయులు ఆలయ నీటి గుండం వద్ద ప్రమాదాల నివారణకు కంచె ఏర్పాటు చేయించారు.
బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకం
నంద్యాల(న్యూటౌన్): పట్టణానికి చెందిన మహంకాళి జశ్వంత్ జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ డబుల్స్‌లో గోల్డ్ మెడల్, సింగిల్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించినట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాథ్, సెక్రటరీ అంకమ్మ చౌదరి తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన గోవాలో అండర్–13 ర్యాంకింగ్ నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయన్నారు.ఇందులో జశ్వంత్ ప్రతిభ చాటి బంగారు పతకంతో పాటు ట్రోఫీ అందుకున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ క్రీడాకారుడిని ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ నంద్యాల జిల్లా సెక్రటరీ వంశీధర్, కోచ్ నాగార్జున పాల్గొన్నారు.
మంటల్లో చిక్కుకున్న లారీ
తుగ్గలి: లారీ టైర్లు వేడెక్కి మంటలు వ్యాపించిన ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని చెర్వుతండ వద్ద చోటు చేసుకుంది. ముంబై నుంచి చైన్నెకు బెల్లం పానకం ట్యాంకర్‌తో వెళుతున్న లారీ మార్గమధ్యంలో చెర్వుతండ బ్రిడ్జి కిందికి రాగానే టైర్లు హీటెక్కి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ లారీ ఎక్కడ పేలుతుందోనని అక్కడ గుమికూడిన జనం బెంబేలెత్తి పోయారు. ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం కాలి పోయింది. స్థానికులు సమాచారం అందించడంతో పత్తికొండ నుంచి ఫైర్ ఇంజిన్ వెళ్లి మంటలను ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. రైల్వే బ్రిడ్జి కింద లారీకి మంటలు వ్యాపించడంతో రైల్వే అధికారులు సైతం అప్రమత్త మయ్యారు. ప్రమాదంతో ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది.

అమ్మవారికి పల్లకీ సేవ

అమ్మవారికి పల్లకీ సేవ

అమ్మవారికి పల్లకీ సేవ