
వక్ఫ్ చట్ట సవరణను వెనక్కి తీసుకోవాలి
కర్నూలు(సెంట్రల్): నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని సేవ్ వక్ఫ్..సేవ్ రాజ్యాంగం జేఏసీ కన్వీనర్ మౌలానా సయ్యద్ జాకీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై నేటి (సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈసభకు రాజకీయాలకు అతీతంగా హాజరై మద్దతు తెలపాలన్నారు. మంగళవారం మౌర్య ఇన్‌కు ఎదురుగా ఉన్న మసీదులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కో కన్వీనర్లు ఎంఏ హమీద్, ఎస్‌ఎండీ షరీఫ్‌లతో కలసి మాట్లాడారు. బహిరంగ సభకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా చేసినట్లు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముస్లిం సంస్థల వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడంతో చట్టానికి సవరణలు చేశారని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చాక మసీదులు, మదరసాలు, కబరస్తాన్‌ల భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మరోవైపు ఇప్పటికే ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన పది రకాల చట్టాలను రద్దు చేసినట్లు చెప్పారు.ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ముక్తకంఠంతో ఖండిస్తూ చేపట్టే బహిరంగసభను జయప్రదం చేయాలని ఆయన రాజకీయ పార్టీలు, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళ సంఘాల ప్రతినిధులను కోరారు.