
ముగిసిన రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు
కర్నూలు (టౌన్): నగర శివారులోని ఆదర్శ విద్యా మందిర్ క్రీడా మైదానంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి రగ్బీ జూనియర్ అండర్–18 బాల, బాలికల చాంపియన్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. బాలుర విభాగంలో ప్రకాశం (ప్రథమ), కర్నూలు (ద్వితీయ), విశాఖపట్నం (తృతీయ), బాలికల విభాగంలో గుంటూరు (ప్రథమ), అనంతపురం (ద్వితీయ), తూర్పు గోదావరి (తృతీయ) స్థానాల్లో నిలిచాయి. విజేతలకు ఆదర్శ విద్యా మందిర్ డైరెక్టర్ డాక్టర్ బి. హరికిషన్, రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని చాటి పదిమందికి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో రగ్బీ ఇండియా ప్రతినిధి నోయల్ మ్యాథ్య్సు, రగ్బీ, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.