
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు: స్థానిక సంతోష్ నగర్ వద్ద లోకాయుక్త ఆఫీస్ ఎదురుగా 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ ఇస్మాయిల్ (38) అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతపురం జిల్లా గుంతకల్లు తిలక్ నగర్‌కు చెందిన ఇస్మాయల్ ప్రస్తుతం కర్నూలు శివారులోని గీతాముఖర్జీ నగర్‌లో నివాసముంటూ కూలీ పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతనికి ఇద్దరు కొడుకులు, కూతురు సంతానం. శుక్రవారం రాత్రి లోకాయుక్త కార్యాలయం వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుంచి బెంగళూరు వైపు వెళ్లే గుర్తు తెలియని కారు ఢీకొంది. తలకు, కాళ్లకు బలమైన గాయాలై అపస్మారక స్థితిలో పడివుండగా స్థానికులు 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీ వార్డులో డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ కేంద్రానికి తరలించారు. భార్య షెహనాజ్ బేగం ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.