
తొలగని
‘దారి’ద్య్రం
గ్రామీణ ప్రాంతాలకు చెందిన రోడ్లు పూర్తి స్థాయిలో ఛిద్రం అయ్యాయి. పల్లె ప్రజలు అవస్థల మధ్య ప్రయాణాలను సాగిస్తున్నారు. ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రోడ్లపై తట్టెడు మట్టి కూడా వేయలేదని ఆరోపణలు చేసిన కూటమి నేతలు నేడు పల్లె రోడ్ల గురించి పట్టించుకున్న పాపాన పోవడం లేదనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. పల్లెలకు సంబంధించిన రోడ్లు అస్తవ్యస్తంగా మారడంతో పలు బస్సు సర్వీసులు కూడా రద్దు అయినట్లు తెలుస్తోంది. కోడుమూరు నుంచి గూడురు వరకు (వయా చనుగొండ్ల ) రోడ్డు పూర్తి అయినా నేటికీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎమ్మిగనూరు, కోసిగి, కౌతాళం, పెద్దకడుబూరు తదితర మండలాల్లోని గ్రామాలకు చెందిన రోడ్లు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి.
● ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని రుద్రవరం – శిరివెళ్ల రోడ్డు పూర్తి స్థాయిలో ఛిద్రమైంది. గుంతలమయంగా మారిన ఈ రోడ్డుపై 15 గ్రామాలకు చెందిన ప్రజలు అవస్థల ప్రయాణం చేస్తున్నారు.
● గ్రామాల్లో డ్రైనేజీలను ఏర్పాటు చేయకుండా సీసీ రోడ్లను నిర్మించడంతో అనేక ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. జూపాడుబంగ్లాతో పాటు తంగడంచె ఎస్సీ, బీసీ కాలనీలు, పారుమంచాల ఎస్సీ కాలనీతో అంతర్గత రహదారులు నిర్మించినా డ్రైనేజీలను ఏర్పాటు చేయలేదు. వర్షపు నీరు రోడ్లపైనే నిలిచి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.