
సార్.. మాకెందుకు పుస్తకాలు ఇవ్వరు?
● డీఈఓ కార్యాలయం దగ్గర
విద్యార్థుల నిరసన
కర్నూలు సిటీ: ‘సార్..మాకెందుకు పుస్తకాలు ఇవ్వడం లేదు’ అంటూ విద్యార్థులు శుక్రవారం కర్నూలు డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు రావడం లేదని, పాఠాలు చెప్పే వారు కరువయ్యారని.. ఇలాగైతే ఎలా చదువుకోవాలని ప్రశ్నించారు. కర్నూలు బీక్యాంపులో ఉన్న నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8వ తరగతి వరకు ఉంది. ఈ స్కూల్‌లో మొత్తం 418 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల పునఃవ్యవస్థీకరణతో ఆ స్కూల్‌ను మోడల్ ప్రైమరీ పాఠశాలగా మార్పు చేశారు. అందులో 6,7,8 తరగతులకు చెందిన 183 మంది విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ పాఠశాలకు మ్యాపింగ్ చేశారు. మ్యాపింగ్ చేసిన స్కూల్‌కు వెళ్లకుండా పాత పాఠశాలలోనే తరగతులకు విద్యార్థులు హాజరవుతున్నారు. పుస్తకాలు ఇవ్వకపోవడంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా పెట్టకపోవడంతో విద్యార్థులు శుక్రవారం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.