
విధి ‘పరీక్ష’లో విగతజీవిగా!
● బైక్ చక్రంలో బురక ఇరుక్కుని కింద పడిన మహిళ ● వెనక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో దుర్మరణం
పాణ్యం: టీచర్ ఉద్యోగం సాధించాలన్నది ఆమె కల. ప్రభుత్వ కొలువు సాధించి కుటుంబానికి అండగా నిలవాలనుకుంది. కల సాకారం చేసుకునేందుకు పరీక్షకు సైతం హాజరైంది. విధి ఆ కలతో పాటు ఆమెను ఛిద్రం చేసింది. పాణ్యం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దుర్మరణం చెందింది. పాణ్యం ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన ఎస్ షబానా (30) పాణ్యం సమీపంలో ఆర్‌జీఎం కళాశాలలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన డీఎస్సీ పరీక్షకు హాజరైంది. పరీక్ష రాసిన తర్వాత భర్త ఇద్రూస్‌బాషాతో కలసి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గ మధ్యలో పాణ్యం వద్ద ఎస్సార్బీసీ కాల్వ దాటగానే షబానా ధరించిన బురక బైక్ వెనుక చక్రంలో ఇరుక్కుపోవడంతో ఆమె కింద పడింది. అదే సమయంలో వారి వెనుక వస్తున్న ట్యాంకర్ ఆమైపె వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందింది. హైవే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ట్యాంకర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల జీజీహెచ్‌కు తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం కాగా.. ఇద్రూస్ బాషా పాలిష్ కటింగ్ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.