
పేద విద్యార్థులకు అందని ఉచిత విద్య
● అడ్మిషన్లకు నిరాకరిస్తున్న ప్రయివేట్ పాఠశాలలు ● బకాయిలు చెల్లించాలని మొండిపట్టు ● విద్యాశాఖ నోటీసులకూ స్పందించని యాజమాన్యాలు ● అడ్మిషన్లకు నేటితో ముగియనున్న గడువు ● డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించిన తల్లిదండ్రులు
కర్నూలు సిటీ: కూటమి ప్రభుత్వంలో ఉచిత విద్య అందని ద్రాక్షగా మారింది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయి పాఠశాలల కేటాయింపు చేపట్టినా ఇప్పటికీ అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కిరాని పరిస్థితి. పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు దాటుతున్నా ఇప్పటికీ తమ పిల్లలకు ప్రయివేట్ పాఠశాలలు అడ్మిషన్ ఇవ్వకపోవడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. జిల్లా కలెక్టర్ ఆదేశిస్తున్నా, డీఈఓ చర్చలు సాగిస్తున్నా ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు మెట్టు దిగిరాని పరిస్థితి. అదేమంటే.. ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందో, లేదోనని తమకు అనుమానంగా ఉందని చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో శుక్రవారం వందలాది మంది తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ప్రతినిధులతో కలిసి డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఉచిత విద్యపై కొరవడిన చిత్తశుద్ధి
కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్లలో పేదింటి పిల్లలు చదువుకునే అవకాశాన్ని 2022–23 నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కల్పించారు. మూడేళ్లు ఎక్కడ కూడా ఉచిత విద్యకు ఎంపికై న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చదువులు సాఫీగా సాగిపోయాయి. అయితే గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడంతో కోర్టు జీఓ 24 రద్దు చేసింది. అయితే 2024–25 విద్యా సంవత్సరం విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా జీఓను కొనసాగిస్తూ తీర్పునిచ్చింది. 2025–26 విద్యా సంవత్సరంలో 12(1)సీ ప్రకారం సరైన విధివిధానాలు లేకుండా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టారు. ఫస్ట్, సెకెండ్ జాబితాలు విడుదల చేసి, ఎంపికై న వారి వివరాలను ఆయా స్కూళ్లకు పంపించారు. అయితే మెజార్టీ స్కూళ్ల యాజమాన్యాలు అడ్మిషన్ చేసుకోకుండా తల్లిదండ్రులను తిప్పిపంపుతున్నారు.
నోటీసులను లెక్కచేయని యాజమాన్యాలు
ఆయా ప్రయివేట్ పాఠశాలల్లో ఉచిత విద్య కింద సీటు పొందినప్పటికీ అడ్మిషన్ ఇవ్వని పరిస్థితిపై జిల్లా విద్యా శాఖ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు జారీ చేస్తూ పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు డీఈఓతో సమావేశమై బకాయిలు చెల్లించకపోతే అడ్మిషన్లు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఆయన సర్దిచెప్పినప్పటికీ అడ్మిషన్లు ఇవ్వని పరిస్థితి. ఇదే సమయంలో రెండో విడత సీట్ల కేటాయింపు జరిగిపోయింది. ఈ విద్యార్థులు కూడా ఆయా పాఠశాలలకు వెళ్లగా అడ్మిషన్‌కు నిరాకరించడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
డీఈఓ కార్యాలయం చుట్టడి
ప్రయివేట్ పాఠశాలల తీరుతో విసిగిపోయిన తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలతో కలిసి శుక్రవారం డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో డీఈఓ లేకపోవడంతో అక్కడే మెట్లపై కూర్చొని నిరసన తెలిపారు. డీఈఓ వచ్చాక ఆయనను చుట్టుముట్టి అడ్మిషన్ ఇవ్వని ప్రయివేట్ పాఠశాలలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. పిల్లలకు అన్యాయం చేయకండిని చేతులెత్తి మొక్కారు. ఈ నేపథ్యంలో డీఈఓ స్పందిస్తూ శనివారం సాయంత్రంలోపు సీట్లు పొందిన విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించుకునేలా చూస్తామన్నారు. లేనిపక్షంలో ఏ కారణంచేత తిరస్కరించారో స్పష్టంగా నివేదిక ఇవ్వాలని ఎంఈఓను ఆదేశించారు.
122 పాఠశాలల్లో
సీట్లు పొందిన విద్యార్థులు
జిల్లాలోని ప్రయివేట్ స్కూళ్లు .. 769
1,110
ఉచిత విద్యను అందించేందుకు
మొదటి విడతలో దరఖాస్తు
చేసుకున్న పాఠశాలలు
384
262 పాఠశాలల్లో అడ్మిషన్‌కు నిరాకరించిన విద్యార్థుల సంఖ్య
1,179
ఉచిత విద్య కోసం దరఖాస్తు
చేసుకున్న విద్యార్థుల సంఖ్య
173 స్కూళ్లలో రెండో విడత సీట్లు దక్కించుకున్న విద్యార్థులు
1,056
2,289