
ప్రైవేటు దిగిరాక.. అడ్మిషన్లు అందక!
● ఓర్వకల్లు మండలం నన్నూరుకు చెందిన మద్దయ్యకు ఇద్దరు మనవళ్లు. ఒకరు నన్నూరులోనే చదువుతున్నారు. మరో మనవుడు కురువ అనిల్ కుమార్ 1వ తరగతికి ఉచిత విద్య కోసం దరఖాస్తు చేశారు. వీరికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్(కేజేఎఫ్ సిటీ, చిన్నటేకూరు)లో సీటు కేటాయించారు. ఈ స్కూల్ గతంలో నన్నూరు పరిధిలో ఉంది. ప్రస్తుతం కల్లూరు మండలం చిన్నటేకూరుకు మార్చారు. యాజమాన్యం ఈ స్కూల్ చిరునామాను మార్చకపోవడంతో ఆన్‌లైన్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌ను ఎంపిక చేసుకున్నారు. అడ్మిషన్ కోసం స్కూల్‌కు వెళితే మీరు అర్హులు కాదని వెనక్కి పంపించారు. కల్లూరు ఎంఈఓ ఆ స్కూల్‌కి నోటీసులు ఇచ్చి చేర్చుకోవాలని సూచించారు. అయినప్పటికీ యాజమాన్యం పెడచెవిన పెడుతుండటంతో తల్లిదండ్రులు వారం రోజులుగా డీఈఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
● కర్నూలు నగరంలోని బంగారుపేటకి చెందిన సి.శిరీషా, రామాంజనేయులు దంపతులకు ఇద్దరు సంతా నం. చిన్న కూతురు సి.యామినికి ఉచిత విద్య కింద దరఖాస్తు చేయగా కొత్తపేటలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో సీటు వచ్చింది. అయితే అడ్మిషన్ కోసం వెళితే ప్రభుత్వం మాకు డబ్బులు ఇస్తుందనే నమ్మకం లేదని, ఫీజులు ప్రభుత్వం ఇవ్వకపోతే మేమే చెల్లిస్తామని రాతపూర్వకంగా ఆ స్కూల్ యాజమాన్యం రాయించుకుంది. అయినప్పటికీ సీటు ఇవ్వకుండా తిప్పుకుంటున్నారు.
● కల్లూరు మండలం కస్తూరి నగర్‌లో నివాసం ఉంటున్న బండారి శివాజీకి ఒక కూతురు సంతానం. చిరుద్యోగం చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఒకటో తరగతిలో ప్రవేశానికి విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా దరఖాస్తు చేయగా అబ్బాస్ నగర్‌లోని రవీంద్ర స్కూల్‌లో సీటు వచ్చింది. అయితే మీరు నివాసం ఉంటున్న కాలనీ నుంచి మా స్కూల్‌కి రావాలంటే హైవేరోడ్డు ఉందని, రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని అడ్మిషన్‌కు నిరాకరించారు. మొదటి, రెండో విడతలోనూ సీటు కేటాయించిన యాజమాన్యాం అడ్మిషన్ ఇవ్వడం లేదని ఆయన వాపోతున్నాడు.
● ...జిల్లాలో వందలాది మంది తల్లిదండ్రులు పరిస్థితి ఇదేవిధంగా ఉంది. ఉచిత విద్యకు ఎంపికై నా ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు అడ్మిషన్ ఇవ్వకుండా చుక్కలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

ప్రైవేటు దిగిరాక.. అడ్మిషన్లు అందక!

ప్రైవేటు దిగిరాక.. అడ్మిషన్లు అందక!