
జూలై 10న ఎల్లెల్సీకి నీటి విడుదల
హొళగుంద: కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నుంచి జూలై 10న ఎల్లెల్సీకి కర్ణాటక కోటా నీటి విడుదలకు కర్ణాటక నీటి సలహా మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. శుక్రవారం బెంగళూరులోని విధానసౌధలో జరిగిన 124వ నీటి సలహా మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1,620 అడుగుల వద్ద 60 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే ఈ ఏడాది ముందుగానే డ్యాంకు వరదలు రావడం, ఇంకా ఆగస్ట్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉండడంతో కాలువలకు నీటి విడుదలపై సమావేశం నిర్వహించారు. ప్రస్తుత నిల్వ ఆధారంగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకారంగా ఖరీఫ్‌కు జూలై 10 నుంచి నవంబర్ 30 వరకు కర్ణాటక దిగువ కాలువకు 650 క్యూసెక్కుల ప్రకారం నీరు విడుదల చేయనున్నారు. ఇక ఆంధ్ర అధికారులు తమ కోటా నీటిలో ఇండెంట్ ఇస్తే అదే రోజు ఇరు రాష్ట్రాల కోటా నీటిని (దాదాపు 1,400 క్యూసెక్కులు) వదలనున్నారు. ఇదిలాఉంటే ఎల్లెల్సీ 155 కి.మీ, 205కి.మీ నుంచి 250 కి.మీ వరకు కాలువలో గత నెలన్నర రోజులుగా ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తి మందకొడిగా సాగుతుండటంతో నీటి విదుదల నాటికి పూర్తవుతాయో లేదోననే ఆందోళన వ్యక్తమవుతోంది. అదేవిధంగా టీబీ డ్యాం 33 కొత్త క్రస్టు గేట్లను అమర్చే పనులు డ్యాంకు వచ్చే వరదను బట్టి డిసెంబర్ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా టీబీ డ్యాం నుంచి వివిధ కాలువలతో పాటు దిగువ కాలువ(ఎల్లెల్సీ) కింద కేవలం ఖరీఫ్‌కు మాత్రమే సాగుకు నీరిచ్చేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
బెంగళూరులో జరిగిన ఐసీసీలో నిర్ణయం

జూలై 10న ఎల్లెల్సీకి నీటి విడుదల