
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
మంత్రాలయం: కట్టుకున్న భార్యనే ఒక భర్త మద్యం మత్తులో కడతేర్చాడు. నూరేళ్ల బంధాన్ని మధ్యలోనే తెంచుకున్నాడు. మంత్రాలయం మండలం సూగూరు గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బోయ హనుమంతును 28 ఏళ్ల క్రితం ఎమ్మిగనూరు మండలం గుడేకల్ గ్రామానికి చెందిన బి.లక్ష్మిదేవి(45) వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని రోజు లుగా హనుమంతు మద్యం తాగుతూ తిరిగేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. అనుమానంతో భార్యను వేధిస్తూ వచ్చాడు. పెద్దలు ఎంతగా నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. శుక్రవారం వేకువ జామున 3.30 గంటల సమయంలో గాఢ నిద్రలో ఉన్న భార్య పై ఇంట్లోని గుంటక మేడిగుంజతో విచక్షణ రహితంగా దాడికి చేశాడు. తల్లి అరుపులు విన్న కుమారుడు, కుమార్తె అడ్డుకోబోయారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం బొలెరో వాహనంలో ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యుడు అప్పటికే ఆమె ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. కళ్లెదుటే తల్లి మృతి చెందడంతో కుమారుడు, కుమార్తె బోరున విలపించారు. భార్యను హతమార్చిన హనుమంతు ఊర్లోనే రోకలిబండ పట్టుకుని తిరుగుతూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఐ శివాంజల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మద్యం మత్తులో భార్యను చంపిన భర్త