
శ్రీమఠంలో భక్తుల రద్దీ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి దర్శనానికి గురువారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో మంత్రాలయ క్షేత్రం కళకళలాడింది. భక్తులు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ, తర్వాత రాఘవేంద్రుల మూల బృందావన దర్శనం చేసుకున్నారు. సుమారు రెండున్నర గంటల సమయం పట్టింది. అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లతో భక్తుల రద్దీ కనిపించింది.
పాఠశాలకు వచ్చి..
విద్యార్థులతో మాట్లాడి
● కె.సింగవరంలో తెలంగాణ విజిలెన్స్ డీజీ
సి.బెళగల్: తెలంగాణ రాష్ట విజిలెన్స్ డీజీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తన స్వగ్రామమైన కె.సింగవరానికి గురువారం వచ్చారు. గ్రామంలోని యూపీ స్కూల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ కావడంతో అక్కడికి చేరుకుని విద్యార్థులతో గడిపారు. ఈ సందర్భంగా స్కూల్ హెచ్‌ఎం రాధ, సర్పంచ్ రవీంద్రరెడ్డి, ఎంఈఓ ఆదామ్‌బాషా, స్కూల్ టీచర్లు, విద్యార్థులతో కలసి ఆయన పాఠశాల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట విజిలెన్స్ డీజీని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద నాగేశ్వరెడ్డి, ఉపాధ్యాయులు లక్ష్మన్న, క్రిష్ణారెడ్డి, వెంకటేశ్వర్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ ఏడీఏల బదిలీలు కొలిక్కి
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో ఎట్టకేలకు ఏడీఏల బదిలీలు కొలిక్కి వచ్చాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్ డిల్లీరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రానికి డోన్ ఏడీఏ అశోక్‌వర్ధన్‌రెడ్డి, శైలకుమారీలను నియమించారు. తాజాగా అశోక్‌వర్ధన్‌రెడ్డిని భూసార పరీక్ష కేంద్రం ఏడీఏగా నియమించారు. శైలకుమారికి పోస్టింగ్ ఇవ్వలేదు. మొదట పలమనేరులో ఏడీఏగా పనిచేస్తున్న అన్నపూర్ణను ఎమ్మిగనూరు సీడ్ టెస్టింగ్ ల్యాబ్ ఏడీఏగా నియమించారు. తాజా ఉత్తర్వుల్లో ఈమె పేరు లేదు. కర్నూలు డీఆర్‌సీలో ఏడీఏగా పనిచేస్తున్న గిరీష్ ఎలాంటి ఆప్షన్ ఇవ్వలేదు. అయినప్పటికీ నందికొట్కూరు ఏడీఏగా బదిలీ చేశారు. అయితే ఈ పోస్టులో ఎవ్వరినీ నియమించలేదు. ఈ పోస్టు కోసం అన్నపూర్ణ కూటమి పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఏడీఏల బదిలీల్లో ఎలాంటి మార్పులు లేవు.
ఆషాఢమాసం ఎఫెక్ట్
మహానంది: ఆషాఢమాసం ప్రారంభం కావడంతో మహానందికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వేసవిసెలవులతో పాటు శుభముహూర్తాలు ఉన్నందున గత నెలరోజులుగా నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడిన మహానందీశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం భక్తులు లేక వెలవెలబోతూ కనిపించింది.

శ్రీమఠంలో భక్తుల రద్దీ