
ఇదేమి ‘తీరు’వా?
బకాయిలు
వసూలు చేయమన్నాం
కాలువల ద్వారా సాగునీటిని పంటల సాగుకు వాడుకుంటున్న రైతుల నుంచి బకాయి పడ్డ పన్నులను వసూలు చేయాలని వీఆర్వోలకు తెలిపాం. అయితే మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అన్నదాత సుఖీభవ పథకాలు వంటిపై ప్రచారం చేస్తున్న విషయంపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. సాగునీరు సక్రమంగా రాకున్నా పన్నులు ఎలా చెల్లించాలని కొందరు రైతులు తన దృష్టికి తెచ్చారు.
– ఎజాజ్ అహ్మద్, చిప్పగిరి తహసీల్దార్
ఆలూరు: ‘‘ఆయకట్టు భూములకు సాగునీరు అంద కున్నా మాకు సంబంధం లేదు. మీరు పెండింగ్‌లో ఉన్న నీటి తీరువా బకాయిలు చెల్లించాలి. ఈకేవైసీ చేసుకోవాలి. లేదంటే అన్నదాత సుఖీభవ పథకం అమలు కాదు’’ అంటూ రైతులపై వీఆర్వోలు ఒత్తిళ్లు తెస్తున్నారు. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువ కింద పొలాలు ఉన్న రైతులు నీటితీరువా వెంటనే చెల్లించాలని మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. హాలహర్వి మండలం ఎం.కె.పల్లి, శ్రీధర్‌హాళ్, బాపురం, కొక్కెరచేడు, చింతకుంట, చిప్పగిరి మండలం బెల్డోణ, రామదుర్గం, ఖాజీపురం, తిమ్మాపురం, ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాగే ఇంగదహాళ్, ఏ.గోనెహాళ్, వందవాగిలి, గజ్జహళ్లి, హొళగుంద, కోకిలతోట గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి పెండింగ్ బకాయిలను చెల్లించాలంటున్నారు. వీఆర్వోలతోపాటు టీడీపీ నాయకులు కూడా వెళ్తున్నారు. రైతులపై ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో తహసీల్దార్ కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఎంకేపల్లి గ్రామంలో మైక్ ద్వారా నీటి తీరువా చెల్లించాలని ప్రచారం చేయడం బహిర్గతమైంది.
ఏడాదికి ఎకరాకు రూ. 120
ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి మండలం కమ్మకొట్టాల గ్రామాల నుంచి హెచ్చెల్సీ ప్రారంభమై ఆలూరు మండలం హత్తిబెళగళ్ గ్రామం వరకు సాగుతుంది. ఈకాలువ పరిధిలో 19 డీపీల కింద 14,555 ఎకరాలకు కాను 250 క్యూసెక్కుల సాగునీరు విడుదల కావాల్సి ఉంది. అయితే కాలువ పటిష్టతను కోల్పోవడంతో సాగనీరు అంతా వృథా అవుతోంది. కాలువ కింద కేవలం 4వేల నుంచి 6 వేల ఎకరాలకు సాగునీరు మించి అందటంలేని రైతులు చెబుతున్నారు. నీరు అందినా, అందకున్నా ఏడాది ఎకరాకు రూ.120 ప్రకారం చెల్లించాలని కొందరు వీఆర్వోలు టీడీపీ నాయకులతో కలసి రైతులపై ఒత్తిడి చేస్తున్నారు. ఎల్లెల్సీ కింద ఆలూరు నియోజకవర్గంలో చింతకుంట, బాపురం, హొళగుంద మూడు సెక్షన్లు ఉన్నాయి. చివరి ఆయకట్టు రైతులకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. అయినా నీటి పన్ను చెల్లించాలని రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు.
సాగునీరు అందకున్నా
పన్ను చెల్లించాలా?
ఆందోళన చెందుతున్న రైతులు