
డ్రగ్స్‌తో జీవితాలను నాశనం చేసుకోవద్దు
కర్నూలు(సెంట్రల్): డ్రగ్స్ బారిన పడి యువత జీవితాలను నాశనం చేసుకోవద్దని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అన్నారు. గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాల రవాణా, వినియోగంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిషేధం విధించినట్లు చెప్పారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతముందు రాజ్ విహార్‌నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తాం
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్ఫలితాలపై కళాశాలలు, పాఠశాలలు, మూనివర్సిటీ సమీపంలో హోర్డింగ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలలో ఈగల్ టీంలను విద్యార్థులతో ఏర్పాటు చేశామన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థులు డ్రగ్స్ అలవాటు పడకుండా వాటితో కలిగే అనర్థాలపై తల్లిదండ్రులు వివరించాలన్నారు. జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణాపై పటిష్ట నిఘా ఉన్నట్లు డీఐజీ కోయ ప్రవీణ్ చెప్పారు. ఇంట్లో ఒక్కరూ డ్రగ్స్ తీసుకుంటే ఆ కుటుంబం మొత్తం నాశనం అవుతుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి అన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1972కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్ సూచించారు. కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా వేసి ఉంచాలన్నారు. అనంతర డ్రగ్స్ వినియోగానికి దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కేర్ కమిటీ సభ్యుడు రాజేంద్రప్రసాద్, స్ఫూర్తి రిహాబిలిటేషన్ సంస్థ ప్రతినిధి శివశంకర్, సైకియాట్రిస్టు డాక్టర్ చైతన్య కుమార్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా