
ఐజీ గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెటింగ్
ఎమ్మిగనూరుటౌన్: చేనేత కార్మికులు ఉత్పత్తి చేస్తున్న టవళ్లు, బెడ్‌షీట్లకు భౌగోళిక గుర్తింపు(ఐజీ) వస్తే అంతర్జాతీయంగా మార్కెటింగ్ పెరగుతుందని రెసెల్యూట్ బి2బి సంస్థ లీగల్ కౌన్సిల్ ప్రతినిధి శ్రీవత్సవ తెలిపారు. ఎమ్మిగనూరులోని వైడబ్లూసీఎస్ కార్యాలయంలో చేనేత కార్మికులు ఉత్పత్తి చేసిన బర్డ్ ఐ టవళ్లు, జిందగీ బెడ్‌షీట్‌లను చేనేత జౌళిశాఖ డీఓ నరసింహారెడ్డి, స్థానిక సంఘ కార్యదర్శి, ఏడీ అప్పాజిలతో కలిసి ఆయన పరిశీలించారు. చేనేత కార్మికులతో సమావేశమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పద్మశ్రీ మాచాని సోమప్ప ప్రారంభించిన సొసైటీ ద్వారా ఉత్పత్తి అయిన టవళ్లు, బెడ్‌షీట్లకు భౌగోళిక గుర్తింపునకు తాము పరిశీలించామన్నారు. సేకరించిన వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని అక్కడ వారు పరిశీలించిన తరువాత ఐజీ గుర్తింపు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఐజీ గుర్తింపు వస్తే ఎమ్మిగనూరులో మాత్రమే ఆయా ఉత్పత్తులు చేయాల్సి ఉంటుందన్నారు. తద్వార ఉత్పత్తుల విక్రయాల మార్కెటింగ్ పెరగడంతో పాటు ఆయా ఉత్పత్తుల ధరలు కూడా 15 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి టవళ్లు, బెడ్‌షీట్లకు జీఐ గుర్తింపు వస్తే ఆయా ఉత్పత్తులను వేరొకరు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉండబోదన్నారు.
ఎమ్మిగనూరు చేనేతకు మంచి పేరు
ఎమ్మిగనూరు ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువగా ఉండటంతో పద్మశ్రీ మాచాని సోమప్ప 1938లో వైడబ్ల్యూసీఎస్‌ను ప్రారంభించారని సొసైటీ కార్యదర్శి, ఏడీ అప్పాజి తెలిపారు. ఎన్‌హెచ్‌డీసీతో నాణ్యమైన ముడిసరుకు తీసుకొని ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మిగనూరు చేనేత ఉత్పత్తులకు మంచి పేరుందన్నారు. సొసైటీ డిజైనర్ రవికుమార్, వైడబ్ల్యూసీఎస్ సిబ్బంది, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
టవళ్లు, బెడ్‌షీట్లను పరిశీలించిన
రెసెల్యూట్ బి2బి సంస్థ ప్రతినిధి

ఐజీ గుర్తింపుతో అంతర్జాతీయ మార్కెటింగ్