
కమిటేషన్ రికవరీ సుప్రీం తీర్పునకు వ్యతిరేకం
కర్నూలు(అగ్రికల్చర్): విశ్రాంత ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషాను కోరారు. గురువారం కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలసి వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులు తీసుకున్న కమిటేషన్ రికవరీ 11 సంవత్సరాల 3 నెలల్లో పూర్తవుతుందన్నారు. అందువల్ల ఇక రికవరీ చేయరాదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని, ఇందుకు అనుగుణంగా ఆరు నెలల పాటు కమిటేషన్ రికవరీ నిలిపేశారన్నారు. అయితే గత నెల నుంచి మళ్లీ రికవరీ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఒక్కో విశ్రాంత ఉద్యోగి పెన్షన్‌లో రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు ప్రభుత్వం మళ్లీ రికవరీ మొదలు పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని.. 11 ఏళ్ల 3 నెలలు కమిటేషన్ రికవరీ చేసి ఉంటే అలాంటి వారికి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో సంఘం జనరల్ సెక్రటరీ జయచంద్రారెడ్డి, ఇతర నాయకులు గోవిందరాజులు, రామచంద్రరావు, జేసీ నాథ్, ఇనయతుల్లా, విజయకుమార్‌రెడ్డి, సూర్యనారాయణ, పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు.