
ఆగకుండా.. ఆటంకం లేకుండా..!
● ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు కార్యాచరణ ● ప్రజల చేతిలో కర్నూలు ట్రాఫిక్ వాట్సాప్ నంబర్ ● త్వరలో ప్రారంభించేందుకు పోలీసుల కసరత్తు
కర్నూలు: ట్రాఫిక్.. కర్నూలు నగరంలో ఇదో పరిష్కారం దొరకని సమస్య. సగటు జీవి సహనానికి పరీక్ష.. దీని పరిష్కారానికి కొన్నేళ్లుగా పోలీసు అధికారులు చేయని ప్రయత్నం.. ప్రయోగమంటూ లేదు. ప్రజలు, వాహనదారులే కాదు.. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఎదుర్కొంటున్న చికాకులు అన్నీ ఇన్నీ కావు. మళ్లీ ఇన్ని రోజులకు మరో కొత్త ఆలోచనతో పోలీసులు ముందుకొచ్చారు. ప్రజల చేతిలో కర్నూలు టాఫిక్ పేరుతో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టనున్నారు.
అవస్థలు...
కర్నూలు మున్సిపాలిటీ స్థాయి నుంచి నగరపాలక సంస్థగా, కుడాగా రూపాంతరం చెందినప్పటికీ ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాలేదు. ఏడాదికేడాది వాహనాల సంఖ్య పెరగడం, రోడ్ల విస్తరణ లేకపోవడం, ఉన్నవి సైతం ఆక్రమణ వల్ల కుచించుకుపోవడం తదితర కారణాలతో నానాటికీ ట్రాఫిక్ సమస్య జఠిలమవుతోంది. దీనికి తోడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఎక్కడైనా వాహనాలు జామ్ అయినా క్రమబద్దీకరించేందుకు గంటలకొద్దీ సమయం పడుతోంది. వాహనాల నియంత్రణ, ఓవర్ లోడ్, రాంగ్ రూట్ ప్రయాణం, ఇతర ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో ప్రజలను భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని పోలీసులు ఆలోచించారు. ప్రజల చేతిలో కర్నూలు ట్రాఫిక్ వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. త్వరలో ట్రాఫిక్ వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.
ఫొటోలు తీసి గ్రూప్‌లో పోస్ట్ చేయాలి
కర్నూలు నగరం నలుదిక్కులా ఎక్కడ ట్రాఫిక్ సమస్య తలెత్తినా, వాహనాలు ఆగిపోయినా స్థానికులు ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయాల్సి ఉంటుంది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దుతారు. ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపటం, డ్రంకెన్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం, సీటు బెల్టు లేకుండా కారు నడపటం వంటి ఉల్లంఘనలపై ఫొటోలు తీసి వాట్సప్‌లో పోస్ట్ చేయవచ్చు. అలాగే వాహనాల చిత్రాలు, వీడియోలు కూడా తీసి షేర్ చేయవచ్చు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై ఫొటోలు, వీడియోల రూపంలో వాట్సప్‌కు షేర్ చేస్తే పోలీసులు వాటిపై విచారణ జరిపి నిర్ధారించుకుని వారికి జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ట్రాఫిక్ అధికారులు వెల్లడించారు.
నగర సమాచారం
కర్నూలు నగర జనాభా సుమారు
ఆరు లక్షలు
ట్రాఫిక్ స్టేషన్‌కు అవసరమైన సిబ్బంది
100 మంది
ప్రస్తుతమున్న సిబ్బంది 60 మంది
నగరంలో ఉన్న ట్రాఫిక్ పాయింట్లు – 36
ట్రాఫిక్ సిగ్నల్స్ – 13
ద్విచక్ర వాహనాలు సుమారు 2 లక్షలు
ఆటోలు 25 వేలకు పైగా
కార్లు 50 వేలకు పైగా
బస్సులు – 2 వేలు
లారీలు, జీపులు – 2 లక్షలు
ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలు, జిల్లాల
నుంచి వచ్చి వెళ్లే అన్ని రకాల
వాహనాలు సుమారు 2 లక్షలు
గతంలో ట్రాఫిక్ నియంత్రణ పేరుతో వెబ్‌సైట్
కర్నూలు నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం గతంలో ట్రాఫిక్ మిత్ర పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అయితే అప్పటి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ బదిలీపై వెళ్లడంతో ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం అటకెక్కింది. కర్నూలు నగరంలో సుమారు ఆరు లక్షలకు పైగా జనాభా ఉంది. రోజురోజుకూ కాలనీలు విస్తరిస్తున్నాయి. వాహనాల సంఖ్య కూడా పెరుగుతోంది. ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ప్రధాన రహదారుల్లో సుమారు 36 పాయింట్లు ఉన్నాయి. ట్రాఫిక్ స్టేషన్‌లో ప్రస్తుతం 60 మంది మాత్రమే సేవలుందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు సిబ్బంది కొరత వేధిస్తున్న నేపథ్యంలో పౌరులను భాగస్వాములను చేసేందుకు పోలీస్ వాట్సప్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నారు.