
వైఎస్సార్‌సీపీ పోరాటంతోనే జీఆర్‌పీ టెండర్లు
ఎమ్మిగనూరుటౌన్: వైఎస్సార్‌సీపీ పోరాటంతోనే ప్రభుత్వం గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం (జీఆర్‌పీ) పనులకు టెండర్లు పిలిచినట్లు వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం లక్ష్మినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి సాగునీరు అందివ్వాలని కోరుతూ ఈ నెల 19న స్థానిక జీఆర్‌పీ కార్యాలయాన్ని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు ముట్టడించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ప్రాజెక్ట్ కింద ఎమ్మిగనూరు నియోజకవర్గంతో పాటు మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని ఎత్తిపోతల పథకం కింద 7 పనులను మొదలెట్టేందుకు ఈ నెల 21న టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో చిలకలడోన ఎత్తిపోతల పథకం–1కు రూ.16,75,250, రెండవ పథకానికి రూ.16,60,270, సోగనూరు పథకం –1కు రూ.16,68,360, రెండవ దానికి రూ.16,66,938, పూలచింత పథకం కింద ఒక పనికి రూ.16,68,360, రెండవ దానికి రూ.16,60,270 కేటాయించడం వివరించారు. జూలై 1న టెండర్లను ఓపెన్ చేసే అవకాశం ఉందని, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ 6 నెలల్లో పనులను పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు.
పనులు వేగంగా పూర్తి చేయాలి
గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం పనులను వేగంగా పూర్తి చేయాలని గడ్డం లక్ష్మినారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన బుధవారం పట్టణంలో జీఆర్‌పీ ఆయకట్టు రైతులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు ముందుగా ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లకు 15 రోజుల్లో మరమ్మతులు చేయాలన్నారు. మిగతా జీఆర్‌పీ పనులను అధికారులు వెంటనే పూర్తి చేయించి సాగునీరందించాలని కోరారు. సర్పంచ్‌లు నరసింహులు, కోటేశ్వరరావు, ప్రకాష్‌రెడ్డి, పార్టీ ప్రచార విభాగం అధ్యక్షుడు చాంద్‌బాషా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు శాంతిరాజు, చుక్కామల్లేష్, వెంకటేష్, గోవిందు, ప్రభాకర్, సోమన్న, శివ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.