
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే
పొగాకు రైతు ఆత్మహత్యాయత్నం
నంద్యాల(న్యూటౌన్): పొగాకు కంపెనీల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వల్లే పొగాకు రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడని, వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామచంద్రుడు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లా మిడ్తూరు మండలం చౌట్కూరుకు చెందిన పొగాకు రైతు మంగళి రామకృష్ణ (47) గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. రామకృష్ణకు గ్రామంలో ఆరెకరాల పొలం ఉండగా ఆంజనేయస్వామి ఆలయ భూమి 16 ఎకరాలను కౌలుకు తీసుకొని జీపీఐ, అలయన్స్ కంపెనీల ఒప్పందంతో పొగాకు పంటను సాగు చేసినట్లు తెలిపారు. పంట సాగు, పెట్టుబడి, కౌలు చెల్లించేందుకు రూ.30 లక్షల వరకు అప్పులు అయినట్లు చెప్పారు. ఈ స్థితిలో జీపీఐ, అలయన్స్ కంపెనీలు పొగాకును కొనుగోలు చేయకపోవడంతో వర్షాల వల్ల పొగాకు నాణ్యత దెబ్బతింటుందేమోనన్న భయంతో, అప్పులు ఇచ్చిన వాళ్లు ఒత్తిడి చేస్తుండటంతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి రైతుల నుంచి పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని, మోసం చేసిన పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.