
డబ్బులెప్పుడు ఇస్తారు సారూ..?
సార్.. మేము రోజూ తిరుగుతున్నాం.. ఆసుపత్రిలో ఇవ్వాల్సిన దానికంటే చార్జీలకే ఎక్కువ ఖర్చయ్యాయి. మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు సార్. అంటూ ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స పొందిన రోగులు ప్రాధేయపడుతున్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స పొందిన రోగులు వైద్య పరీక్షలు, మందుల కోసం పెట్టుకున్న ఖర్చులను డిశ్చార్జ్ అనంతరం అధికారులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆసుపత్రిలోని పేయింగ్ బ్లాక్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్ అయిన రోగులు సంబంధిత బిల్లులు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ ప్రతులను అక్కడ అందజేస్తే ఖర్చు చేసిన మొత్తంలో కొంత తిరిగి ఇస్తారు. అయితే కొన్ని రోజులుగా ఈ కౌంటర్ తెరవడం మానేశారు. దీంతో ఆ కౌంటర్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ వైద్యసేవ కార్యాలయంలో వారు డబ్బుల కోసం ఆరా తీస్తున్నారు. సార్ మాకు డబ్బులు ఎప్పుడిస్తారని వారిని అడుగుతుంటే మాకు సంబంధం లేదని, ఆసుపత్రి అధికారులను కలవాలని చెప్పి పంపిస్తున్నారు.
– కర్నూలు(హాస్పిటల్)