
మధ్యాహ్న భోజనం రుచికరంగా ఉండాలి
ఆదోని సెంట్రల్: పాఠశాలల్లో విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని సబ్‌కలెక్టర్ మౌర్యభరద్వాజ్ సూచించారు. పట్టణంలోని నెహ్రూ మెమోరియల్ పురపాలక ఉన్నత పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు సరిపడా ఇవ్వడం లేదని ఫిర్యాదులు రావడంతో బుధవారం జిల్లా విద్యాధికారి శామ్యూల్‌పాల్, మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణతో కలిసి పరిశీలించారు. భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం తగినంత పెడుతున్నారా? తక్కువగా పెడుతున్నారా అని ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూశారు. మధ్యాహ్న భోజన పథకం రికార్డులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు తగినంత భోజనం వడ్డించాలన్నారు. రుచి, నాణ్యత లోపిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. డిప్యూటీ ఈఓ వెంకటరమణారెడ్డి, హెచ్‌ఎం ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.