
పట్టాలు దాటుతుండగా ఢీకొట్టిన రైలు
● పాలిటెక్నిక్ విద్యార్థి దుర్మరణం
ఆదోని సెంట్రల్: ఆదోనిలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో విద్యార్థి మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని మదిరె గ్రామానికి చెందిన విశ్వనాథ్, సావిత్రి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు నితిన్ బిట్స్ కళాశాలలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రోజు మాదిరిగానే ఉదయం కళాశాలకు బయలుదేరాడు. పట్టణంలోని నల్లగేటు వద్ద కి.మీ. నంబర్ 495/33–31 వద్ద ట్రాకు దాటుతుండగా రైలు ఢీకొని తీవ్ర గాయాలపాలై అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.