
డీసీసీబీలో అక్రమాల పరంపర!
● కూటమి ప్రభుత్వంలో మసకబారిన డీసీసీబీ ప్రతిష్ట ● గతేడాది సెప్టెంబరులో ఆత్మకూరు బ్రాంచ్‌లో రూ.80.12 లక్షల స్వాహా ● చిప్పగిరి మండలంలో రూ.కోటి మింగేసిన సొసైటీ సీఈఓ ● తాజాగా నాగంపల్లి సొసైటీలో రూ.40 లక్షలు స్వాహాకార్యం ● కొండలా పేరుకుపోతున్న నిరర్ధక ఆస్తులు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పరువు బజారున పడుతోంది. ఏదో ఒక మూల అక్రమాలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు బ్యాంకు ఉద్యోగులు, మరోవైపు పీఏసీఎస్ సీఈఓలు నిధులు కొల్లగొడుతూ.. డీసీసీబీ ప్రతిష్టను గంగలో కలిపేస్తుండటం గమనార్హం. దీపం ఉన్నపుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా అవకాశం ఉన్నపుడే డబ్బులు మూట కట్టుకోవడానికి అడ్డుదారులు తొక్కుతున్నారు. ఇటీవల కొత్తపల్లి మండలం నాగంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో సీఈఓ చేతి వాటం ప్రదర్శించి నిధులు కొల్లగొట్టారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అక్రమాలకు అడ్డాగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది సెప్టెంబరు చివర్లో ఆత్మకూరు బ్రాంచ్‌లో దాదాపు రూ.కోటి కుంభకోణం వెలుగు చూసింది. నిధులు మింగేసిన వారు దర్జాగా రోడ్లపై తిరుగుతున్నారు. బ్యాంకుకు మాత్రం ఒక్క రూపాయి రికవరీ కాలేదు. ఇటీవల చిప్పగిరి మండలం రామదుర్గం పీఏసీఎస్‌లో సీఈఓనే నిధులు కొల్లగొట్టారు. ఏకంగా రూ.కోటి స్వాహా కావడం సంచలనమే. తాజాగా నాగంపల్లి పీఏసీఎస్‌లో సీఈఓనే నిధులకు ఎసరు పెట్టారు. వెలుగులోకి రాని అక్రమాలు ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రూ.80.12 లక్షలు స్వాహా..
రికవరీ రూ.5 లక్షలు మాత్రమే..
గతేడాది సెప్టెంబరులో ఆత్మకూరు బ్రాంచ్‌లో క్యాషియర్ ఆల్తాఫ్, పాసింగ్ ఆఫీసర్ రంగయ్య, మరో ఉద్యోగి శంకర్ పథకం ప్రకారం దాదాపు రూ.80.12 లక్షలు నిధులు మళ్లించారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే రికవరీ అయ్యింది. మేనేజర్ పులిరాజుతో సహా నలుగురు సస్పెన్షన్‌లో ఉన్నారు. భారీ ఎత్తున నిధులు కొల్లగొట్టిన వీరు టీడీపీ నేతల ద్వారా పోస్టింగ్‌ల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
పెరిగిపోతున్న ఎన్‌పీఏ
అధికారుల అవినీతి కారణంగా జిల్లా సహకార కేంద్రబ్యాంకు నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి. రికవరీపై దృష్టి పెట్టని అధికారులు స్వాహాపై ఆసక్తి చూపుతుండటం గమనార్హం. ఇందువల్ల బ్యాంకు నిరర్ధక ఆస్తులు పేరుకపోతున్నాయి. 2024 ఏప్రిల్‌లో నిరర్ధక ఆస్తులు రూ.195 కోట్లు ఉండగా ప్రస్తుతం రూ.265 కోట్లకు పెరిగిపోయాయి. నిరర్ధక ఆస్తులు కొండలా పేరుకపోతున్నాయి.
రూ.40 లక్షలు మిగేసిన నాగంపల్లి సీఈఓ
కొత్తపల్లి మండలం నాగంపల్లి పీఏసీఏస్‌కు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సభ్యత్వం ఉంది. పంట రుణాలతో పాటు దీర్ఘకాలిక రుణాలకు కర్నూలు డీసీసీబీ ఈ సొసైటీకి నిధులు ఇస్తుంది. రుణాలు పంపిణీ చేసిన సీఈఓ రికవరీ చేసే సమయంలో చేతివాటం చూపినట్లు స్పష్టమవుతోంది. రైతులు రికవరీ చేసిన మేరకు రసీదులు ఇచ్చినప్పటికీ, సొసైటీకి మాత్రం జమ చేయడంలో కోతలు పెట్టారు. ఒక రైతు నుంచి రూ.లక్ష రికవరీ చేస్తే పూర్తి మొత్తానికి రసీదు ఇచ్చి సొసైటీకి మాత్రం రూ.50 వేలు మాత్రమే జమ చేసేవారు. రెండు బిల్లు బుక్కులు ఉండటం వల్ల ఒక దానిని రైతులకు, మరో దాన్ని సంఘానికి వినియోగించే వారని తెలుస్తోంది. ఈ విధంగా రైతుల నుంచి రికవరి చేసిన మొత్తంలో రూ.40 లక్షల వరకు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. సదరు సీఈఓ కోటేశ్వరరావు మూడు నెలలకుపైగా విధులకు గైర్హాజరు అవుతున్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో అనుమానం వచ్చిన డీసీసీబీ అధికారులు విచారణకు శ్రీకారం చుట్టారు. విచారణ జరిపిన కొద్ది సమయంలోనే రూ.10 లక్షలకుపైగా స్వాహా వెలుగులోకి వచ్చింది. ముక్కున వేలేసుకున్న అధికారులు స్వాహా కార్యం ఎంతుందో తేల్చడానికి లోతుగా విచారణ జరపుతున్నారు. సొసైటీ లావాదేవీలు, రికవరీలపై డీసీసీబీ సంబంధిత బ్రాంచ్ మేనేజర్ దృష్టి ఉండాలి. పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జ్ పర్యవేక్షణ ఉండాలి. సొసైటీపై ఎవ్వరు దృష్టి పెట్టకపోవడంతో యథేచ్ఛగా స్వాహా పర్వాన్ని కొనసాగించినట్లు స్పష్టమవుతోంది.