
ఓపెన్ స్కూల్‌తో చదువులకు సువర్ణావకాశం
నంద్యాల: విద్య పట్ల ఆసక్తి ఉన్న ఉద్యోగులు, గృహిణులు ఓపెన్ స్కూల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో డీఆర్‌ఓ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం దూర విద్యా విధానంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సులను విజయవంతంగా నిర్వహిస్తోందన్నారు. ఆసక్తి కలిగిన వారు జూలై 30 చివరి తేదీలోగా htt ps://apopenschool.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ విద్యాపీఠం జారీ చేసే సర్టిఫికెట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొంది, ఉన్నత చదువులు, ఉద్యోగాలు అర్హత కలిగి ఉన్నాయన్నారు. ఓపెన్ స్కూల్ విధానంగా అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
పోక్సో కేసు నమోదు
పాణ్యం: మండల కేంద్రానికి చెందిన బోయమద్దిలేటిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేంద్రకుమార్‌రెడ్డి తెలిపారు. ఓ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ఈనెల 22న ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. కేసు విచారణ చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు.