
పొగాకు రైతులను ఆదుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో పొగాకు పండించిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రైవేటు కంపెనీలు, రైతుల వద్ద ఉన్న మొత్తం పొగాకు కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై అడ్డంగా కూర్చొని ఆందోళన చేయడంతో పోలీసులకు, రైతులకు మధ్య కొంత మేర వాగ్వాదం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ.. పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, రైతులను మోసం చేస్తున్న పొగాకు కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని అక్కడే భైఠాయించారు. దీంతో సీఐ కంబగిరి రాముడు విషయాన్ని జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ దృష్టికి తీసుకెళ్లారు. జాయింట్ కలెక్టర్ అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడుతూ.. పొగాకు కొనుగోళ్లలో జరుగుతున్న లోపాలపై చర్చించి మూడు రోజుల్లోగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం, ప్రైవేటు కంపెనీల విషయంపై స్పష్టత ఇచ్చి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రైవేటు పొగాకు కంపెనీలు ఒప్పందం చేసుకున్న మేర క్వింటాకు రూ.18 వేలు ఇవ్వాలని రైతు నాయకులు కోరారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శి వెంకటేశ్వరరావు, కౌలు రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు మార్క్, సుధాకర్, సీఐటీయూ నాయకులు లక్ష్మణ్, పొగాకు రైతులు సుబ్బనర్సయ్య, పుల్లారెడ్డి, నారాయణ, రామ్మోహన్, వీరన్న, రామకృష్ణ, బుజ్జన్న, ప్రతాపరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.