
రమణీయం.. విజయీంద్రతీర్థుల రథోత్సవం
హొళగుంద: స్థానిక కోటవీధిలో వెలసిన విజయీంద్రతీర్థుల రథోత్సవంను బ్రాహ్మణులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. విజయీంద్రతీర్థుల 411వ మహా ఆరాధనోత్సవం ముగింపులో భాగంగా జరిగిన ఉత్తరాధన కార్యక్రమం సందర్భంగా రాఘవేంద్రస్వామి, విజయీంద్రతీర్థుల మూల విరాట్‌లకు ప్రత్యేక పూజలు జరిగాయి. శనివారం పూర్వరాధన, ఆదివారం ఏకాదశి, సోమవారం మద్యరాధన పూజలు చేసిన బ్రాహ్మణులు మంగళవారం ఉత్తరాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం మూలవిరాట్‌లకు నిర్మల్య విసర్జన, సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, తులసి అర్చన పూజలు జరిగాయి.
రమణీయంగా సాగిన రథోత్సవం
గ్రామ పురవీధుల్లో స్వామి వారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఈ సందర్భంగా శ్రీపురందరదాసర భజన మండలి, భక్తి భారతి కోలాట మండలి బృందాల ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, చిన్నారులు కోలాట నృత్యాలు, బ్రాహ్మణుల నృత్యాలు అలరించాయి. అనంతరం భజన స్వస్తి వాచన, మహా నైవేద్య, తీర్థ ప్రసాద కార్యక్రమాలతో ఆరోధనోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. కార్యక్రమానికి ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి బ్రాహ్మణులు హాజరైనట్లు విజయీంద్ర తీర్థుల సేవా ట్రస్ట్ సభ్యులు పవనాచారి, రఘునాథాచారి తదితరులు తెలిపారు.