
పచ్చిరొట్ట ఎరువులతో నేల సారవంతం
బండి ఆత్మకూరు: బండి ఆత్మకూరు, ఎరగ్రుంట్ల గ్రామాల్లో ఏఓ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో డీఏఓ వైవీ మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యవసాయం సాంకేతిక విప్లవం ద్వారా రైతులు మరింత నాణ్యమైన దిగుబడులను సాధించేందుకు అధికారులందరూ కృషి చేయాలన్నారు. రసాయన రహితంగా సేంద్రియ వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడి పొందడమే గాకుండా నేలలో కర్బన శాతం, సూక్ష్మ పోషకాలు పెరుగుతాయన్నారు. రైతులు మిశ్రమ పంటలు సాగు చేయాలని, వరి సాగు చేసే నేలలో ముందుగా జీలుగ, పిల్లి పెసర, ఉలవలు వంటి పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలన్నారు. మండలంలో వరి, మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారని, బయో డీజిల్ ఫ్యాక్టరీల్లో వరిగడ్డి, మొక్కజొన్న కాండం ఇతర భాగాలకు డిమాండ్ ఉన్నందున రైతులు సాంకేతిక పరిజ్ఞానంతో ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు. అనంతరం కౌలు రైతులకు గుర్తింపు కార్డులను అందజేశారు. వెటర్నరీ డాక్టర్ అనూష, ఏఈఓ సాయి హిమబిందు, వ్యవసాయ విస్తరణ సిబ్బంది అశోక్ శత్రు నాయక్, ఆసియా పలువురు రైతులు పాల్గొన్నారు.